రాజధాని ఎక్కడ పెట్టాలనేది రాష్ట్ర ప్రభుత్వ విషయమని...ఇష్టానుసారం చేస్తామంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు అని కేంద్ర మాజీ మంత్రి, భాజపై ఎంపీ సుజనా చౌదరి అన్నారు. అమరావతిలో ఇప్పటికే రూ.కోట్ల ప్రజాధనం పెట్టారని ప్రభుత్వానికి గుర్తు చేశారు. 'అమరావతిలో ఇప్పటికే అనేక భవనాలు సిద్ధమయ్యాయి. వరదలను వదిలి బురద రాజకీయాలు చేయడం తగదు'' అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాజధాని విషయంలో ప్రజలు ఆందోళనతో ఉన్నారన్న సుజనా... ప్రతిపక్షం తెదేపాకు చంద్రబాబు ఇంటి ముంపే సమస్యలా కనిపిస్తోందని విమర్శించారు. తెదేపా నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించాలని సూచించారు. ప్రజలను విజయసాయిరెడ్డి తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించిన ఆయన... మంత్రులు బొత్స, అవంతి తలోరకంగా మాట్లాడుతున్నారన్నారు.
ఈ సందర్భంగా సుజనా ప్రభుత్వానికి వేసిన ప్రశ్నలు..
- 50 వేల ఎకరాల్లో పంటనష్టానికి ఎవరు బాధ్యులు?
- సీడబ్ల్యూసీ వరద హెచ్చరిక చేసినా ఎందుకు అప్రమత్తం కాలేదు?
- కావాలనే వరదనీటిని ప్రభుత్వం కిందకు వదిలిందా?
- రాజధాని ప్రాంతాన్ని ముంచాలని చూస్తున్నారా?
- మంత్రులు బొత్స, అవంతి అభిప్రాయాలు ప్రభుత్వ వైఖరా? వ్యక్తిగతమా?
- మోదీ, అమిత్‌షా ఆశీస్సులు తీసుకున్నాం అంటే అర్థం ఏంటి?
- పోలవరం అథారిటీ లేఖను ప్రభుత్వం ఎందుకు మన్నించలేదు?