Sriramanavami Celebrations in AP: శ్రీరామనవమి వేడుకలను గ్రామ గ్రామాన ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. సింహాచలం పుణ్యక్షేత్రంలో ప్రత్యేకంగా అలంకరించిన మండపంలో స్వామివారి కల్యాణం వైభవంగా నిర్వహించారు. విశాఖ శారదాపీఠంలో స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్రస్వామి సమక్షంలో సీతారాముల కల్యాణం జరిగింది. మన్యం జిల్లాలోని రామ మందిరాల వద్ద మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం విలస గ్రామంలో శ్రీ పట్టాభిరామ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు పాల్గొన్నారు. యానాంలోని కనకాలపేటలో తితిదే నిర్వహించిన రాములవారి కల్యాణంలో నటుడు రాజీవ్ కనకాల, యాంకర్ సుమ కుటుంబసభ్యులతో పాల్గొని.... స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.
విజయవాడ పటమట దత్తపీఠం శ్రీరామనవమి వేడుకల్లో గణపతి సచ్చిదానంద స్వామి పాల్గొన్నారు. కృష్ణాజిల్లాలోని అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, మోపిదేవి, చల్లపల్లి, ఘంటసాల మండలాల్లో వాడవాడలా సీతారాముల కళ్యాణం... వైభవోపేతంగా నిర్వహించారు. బాపట్ల జిల్లా ఈపురుపాలెం పద్మనాభునిపేటలో ఉత్సవమూర్తులకు నగరోత్సవం, కల్యాణం ఘనంగా జరిగింది. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం రామాలయం నవమి వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కర్నూలు జిల్లా మంత్రాలయం రాఘవేంద్ర స్వామి ఆలయంలో మూల రామ దేవుడికి మహా అభిషేకం నిర్వహించారు. నంద్యాల కోదండ రామాలయంలోని కల్యాణం వీక్షించేందుకు భక్తులు తరలివచ్చారు. తిరుపతి జిల్లా చంద్రగిరిశ్రీ కోదండరామస్వామి ఆలయంలో కల్యాణం కమనీయంగా సాగింది.
శ్రీరామ నవమిని పురస్కరించుకుని.. గుంటూరులో 22 కిలోమీటర్ల భారీ శోభాయాత్ర నిర్వహించారు. శ్రీరామ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో.. బృందావన్ గార్డెన్ నుంచి మార్కెట్ మీదుగా మల్లారెడ్డి నగర్ వరకు శోభాయాత్ర సాగింది.
ఇదీ చదవండి : భద్రాచలంలో వైభవంగా శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవం