విజయవాడ నగరంలో తొలి నుంచి శాంతి, భద్రతల పరంగా ఎంతో సున్నితమైన ప్రాంతం. రౌడీల ఆగడాలు ఎక్కువే. ప్రస్తుతం ఇక్కడ సమర్థంగా పర్యవేక్షించేందుకు తగిన సిబ్బంది లేకపోవడం సమస్యగా మారింది. ఏదైనా ఘటన జరిగినప్పుడు.. దాన్ని పెద్దది కాకుండా చూస్తున్నారు. అంతే కానీ జరగకుండా నివారించలేకపోతున్నారు. నగర శివారు ప్రాంతాల్లో అసాంఘిక శక్తుల అగడాలు పెచ్చుమీరుతున్నాయి. వీటికి అడ్డుకట్ట వేసేందుకు ప్రారంభించిన నిర్బంధ తనిఖీలు కొన్నాళ్లు చేపట్టి ఆనక వదిలేశారు. పలు విభాగాల్లో దాదాపు 500 పైగా ఖాళీలు ఉన్నాయి. అవసరమైన సిబ్బందిని వెంటనే భర్తీ చేస్తేనే ప్రయోజనం ఉంటుంది. నగరానికి రోజుకు దాదాపు 3 లక్షల మంది అమ్మవారి దర్శనం, కొనుగోళ్లు, వివిధ పనుల నిమిత్తం వస్తుంటారు. పలువురు మంత్రులు, వివిధ శాఖల సీనియర్ అధికారులు నివాసం ఉంటారు. ప్రధాన కార్యక్రమాలు దాదాపు ఇక్కడే జరుగుతుంటాయి. వాణిజ్య కూడలిగా విజయవాడ ఎదిగింది. దీంతో నగర కమిషనరేట్‌కు చాలా ప్రాధాన్యత ఉంది. దీనికి తోడు రాష్ట్ర స్థాయి కార్యక్రమాలు ఇక్కడే జరుగుతున్నాయి. ఫలితంగా ప్రొటోకాల్, బందోబస్తు విధులు పెరిగాయి.
బదిలీలతో ఖాళీలు..
ఫలితంగా శాంతి, భద్రతలపై పర్యవేక్షణ కొరవడుతోంది. నగర పోలీస్ కమిషనరేట్‌లో పలు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీని వల్ల ఉన్నవారిపై పనిభారం బాగా పెరిగింది. చాలా కాలంగా జాయింట్ కమిషనర్ పోస్టును భర్తీ చేయలేదు. గత ఏడాది జేసీపీ ప్రత్యేకంగా కొన్ని విధులు కేటాయిస్తూ జీవో కూడా జారీ చేసింది. నాగేంద్రకుమార్ బదిలీ తర్వాత ఈ పోస్టు ఖాళీగా ఉంది. కీలకమైన పశ్చిమ డీసీపీ పోస్టు గత రోజులుగా భర్తీ చేయలేదు. ఇక్కడ పనిచేస్తున్న విక్రాంత్ పాటిల్ గత నెలలో బదిలీ అయ్యారు. ట్రాఫిక్ డీసీపీ బాబూరావు ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. స్పెషల్ బ్రాంచిలో ఏడీసీపీ పోస్టు ఏడాదిగా ఖాళీనే. గత ఏడాది ఇక్కడ పనిచేసిన నవాబ్‌జాన్‌కు పదోన్నతి రావడంతో ఇక్కడి నుంచి బదిలీ అయ్యారు. పశ్చిమ ఏడీసీపీ లక్ష్మీపతిని ఇటీవల ఈ విభాగానికి ఇన్‌ఛార్జిగా నియమించారు. ఎస్‌బీలోనే మరో ఏసీపీ పోస్టును భర్తీ చేయలేదు. రెండు నెలల క్రితం ఏసీపీగా పనిచేస్తున్న అంకయ్య పదవీ విరమణ చేశారు. దీంతో ఒక ఏసీపీతోనే నెట్టుకొస్తున్నారు. ఈ నెలాఖరుకు సీసీఎస్ ఏడీసీపీ బోస్ పదవీ విరమణ చేస్తున్నారు. బదిలీ అయినవి, పదవీ విరమణ చేసిన స్థానాలు త్వరగా భర్తీ కావడం లేదు. కేవలం అధికారలదే కాదు. కింది స్థాయిలోనూ ఇదే పరిస్థితి. కమిషనరేట్‌లో శాంతి, భద్రతలు, ట్రాఫిక్, సీసీఎస్.. ముఖ్యమైన విభాగాల్లో మొత్తం 2,500 మంది పనిచేస్తున్నారు. ఇంకా 500 మంది సిబ్బంది అవసరం ఉంది. ట్రాఫిక్‌లోనూ సిబ్బంది కొరత పీడిస్తోంది.
అరాచకాలకు అడ్డాగా..
నగరంలో పలు రకాలు నేరాలు జరుగుతుంటాయి. రౌడీ షీటర్ల ఆగడాలు, బ్లేడ్ బ్యాచ్ అరాచకాలు, కాల్‌మనీ కేసులు, వైట్ కాలర్ నేరాలు, దోపిడీలు, కబ్జాలు, తదితరాలు ఎక్కువ నమోదు అవుతుంటాయి. బెజవాడలో గతంలో ముఠా ఘర్షణలు ఎక్కువుగా జరిగేవి. ప్రస్తుతం ఇవి కొంత వరకు తగ్గినా.. పూర్తి స్థాయిలో రూపుమాపాలంటే పటిష్ట నిఘా అవసరం. తగినంత మంది సిబ్బంది ఉంటేనే నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు అవకాశం ఉంది. ఇటీవల నగర నడిబొడ్డన పారిశ్రామికవేత్త రాహుల్ హత్య జరిగింది. ఈ ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఇందులో రౌడీషీటర్ల పాత్ర ఉందని దర్యాప్తులో బయటపడింది. పకడ్బందీ నిఘా కొరవడడంతోనే ఇటువంటివి జరుగుతున్నాయి. శివారు ప్రాంతాల్లో పలువురు యువకులు మత్తులో నేరాలకు పాల్పడుతున్నారు. దారి వెంబడి వెళ్లే వారిపై బ్లేడ్ బ్యాచ్ దాడులకు పాల్పడి దోచుకుంటోంది. కృష్ణలంక, సింగ్‌నగర్, రాజరాజేశ్వరిపేట, ఆటోనగర్, రామవరప్పాడు.. ప్రాంతాల్లో వీరి ఆగడాలు ఎక్కువయ్యాయి. గత ఏడాది సంచలనం సృష్టించిన పటమట గ్యాంగ్ వార్‌లో నిందితుడు పండుపై రౌడీషీట్ తెరిచి నగర బహిష్కరణ విధించారు. ఇటీవల ఓ పుట్టిన రోజు వేడుకలో కత్తితో, కర్రతో చేసిన హడావుడి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఇది బయటకు వచ్చిన తర్వాత పోలీసులు స్పందించి కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
గత మూడేళ్లల్లో కమిషనరేట్ పరిధిలో నేరాల తీరిది..
అంశం | 2018 | 2019 | 2020 |
హత్యలు | 20 | 25 | 24 |
డెకియిటీలు | 3 | 1 | 2 |
దోపిడీలు | 24 | 34 | 32 |
చోరీలు | 167 | 149 | 197 |
హత్యాయత్నాలు | 39 | 28 | 37 |
కిడ్నాప్‌లు | 34 | 31 | 12 |
అత్యాచారాలు | 50 | 52 | 57 |
మోసాలు | 401 | 524 | 392 |
ఇదీ చదవండీ.. CHANDRABABU : 'ప్రజాస్వామ్య హక్కులకు విరుద్ధంగా పోలీసుల చర్యలు'