రాష్ట్ర ప్రభుత్వం కొవిడ్ నియంత్రణకు రూ. రెండు వేల కోట్ల ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని... భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు డిమాండ్ చేశారు. కేంద్రం ఉచిత బియ్యం ఇవ్వటం ప్రారంభించిందని.. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అవసరమైన నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలని కోరారు. కరోనా రోగులకు ఉచితంగా భోజన సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కరోనా పరీక్షల ఫలితాల కోసం మూడు రోజులపాటు నిరీక్షణ లేకుండా అదే రోజు వచ్చేలా చూడాలన్నారు. యువతను ఎక్కువగా కరోనా ప్రభావితం చేస్తున్నందునా... అందుకు కారణాలు తెలుసుకోవాలని సూచించారు.
అర్బన్, రూరల్ హెల్త్ మిషన్ల ద్వారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి వేల కోట్ల నిధులు ఇస్తోందని సోము వీర్రాజు వెల్లడించారు. ఈ నిధులను సౌలభ్యాన్ని బట్టి వినియోగించుకునే వీలుందని.. రూ.30 లక్షల నిధులతోనే ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రం నిర్మించుకోవచ్చని చెప్పారు. కరోనా నియంత్రణకు ప్రధాని మోదీ నిరంతరంగా శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. సీఎం జగన్.. అన్ని రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖ వైద్యులను సంప్రదించి తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.
కరోనాపై తమ విధానాలను ప్రకటిస్తూ ప్రజల్లో నెలకొన్న భయాందోళనలు తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పది, ఇంటర్ పరీక్షలను వాయిదా వేయాలని తమ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు. కరోనాను కట్టడి చేయటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని.. ప్రైవేటు వైద్యవిధానాన్ని నియంత్రించలేకపోతున్నారని విమర్శించారు. రెమిడెసివర్ ఇంజక్షన్లు రూ.40 వేల నుంచి రూ.50 వేలకు నల్లబజారులో అమ్ముతుంటే... ఒక్కకేసూ నమోదు చేయలేదన్నారు.
ఇదీ చదవండి...