Somu veeraju on Budget: రానున్న 25 ఏళ్ల అమృత కాలానికి కేంద్ర బడ్జెట్ పునాది అని.. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు అన్నారు. పారదర్శకమైన సమీకృత అభివృద్ధికి ఈ బడ్జెట్ నాంది పలికిందన్నారు. నేరుగా నగదు బదిలీ ద్వారా పేదలకు ఆర్థికసాయం లభిస్తుందన్నారు. గృహనిర్మాణం, వసతులు , తాగునీరు కల్పనలో దేశం వేగంగా ముందుకెళ్తోందని చెప్పారు. కొవిడ్ కట్టడిలో వ్యాక్సినేషన్ కార్యక్రమం బాగా కలిసొచ్చిందన్నారు.
ఈ అమృతకాల బడ్జెట్.. యువత, మహిళలు, రైతులు, ఎస్సీ, ఎస్టీలకు గొప్ప ఊతమివ్వబోతోందని అన్నారు. త్వరలో ఎల్‌ఐసీ పబ్లిక్ ఇష్యూ రాబోతుందని, ఎంఎస్‌ఎంఈలకు మార్కెటింగ్ సహకారం కోసం నూతన పోర్టల్ రానుందని తెలిపారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమల కోసం ప్రత్యేక క్రెడిట్ గ్యారంటీ పథకం ప్రవేశపెడుతున్నారని.. తద్వారా 2 లక్షల కోట్ల ఆర్థిక నిధులు చేకురాయన్నారు.
మూడేళ్లలో వంద కార్గో టెర్మినళ్ల ఏర్పాటు
పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాభివృద్ధి కోసం.. అదనపు నిధులు, ప్రత్యేక వ్యవస్థలు నెలకొల్పనున్నారని సోము వీర్రాజు తెలిపారు. వచ్చే మూడేళ్లలో వంద కార్గో టెర్మినళ్ల ఏర్పాటు కానున్నాయని చెప్పారు. చిరుధాన్యాల అభివృద్ధికి అదనపు ప్రోత్సాహం లభిస్తుందని వెల్లడించారు. వంటనూనెల కోసం దిగుమతులపై ఆధారపడకుండా.. దేశీయంగా ఉత్పత్తి అవుతుందని, పీపీపీ నమునాలో ఆహార శుద్ధి పరిశ్రమలకు ప్రోత్సాహం లభించనుందని చెప్పారు.
ఇదీ చదవండి:
Chandrababu on Budget: బడ్జెట్ ఆశాజనకంగా లేదు.. రైతులకు ఎలాంటి మేలు జరగదు: చంద్రబాబు