వైరల్ జ్వరాలు, కరోనా లక్షణాలు ఒకేలా కన్పిస్తుంటాయి. వైరల్‌లో జలుబు, దగ్గు, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు, కొందరిలో విరేచనాలు అవుతుంటాయి. కరోనా లక్షణాలు సైతం ఇలానే ఉండటంతో గుర్తించడం చాలా కష్టమని సీనియర్ ఫిజీషియన్ డాక్టర్ శివరాజ్ తెలిపారు. అంతేకాక ఈ లక్షణాలను బట్టి వైరల్ జ్వరాలుగా భావించి నిర్లక్ష్యం చేస్తే కొందరిలో ఆరోగ్యం విషమంగా మారుతోంది. జ్వరంతోపాటు ఇతర లక్షణాలు ఉంటే తొలుత కరోనా పరీక్ష చేయించుకోవాలి. ర్యాపిడ్ యాంటిజెన్‌లో నెగిటివ్ వచ్చినా సరే...ఆర్టీపీసీఆర్ పరీక్ష తప్పనిసరి. అందులోనూ నెగిటివ్ వచ్చి లక్షణాలు కొనసాగుతుంటే వైద్యులను తప్పక సంప్రదించాలి.
కొంత ఊరట..
కరోనాతో ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన పెరిగింది. తరచూ చేతులు కడుక్కోవడం, మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, ఇంటి భోజనం చేయడం వల్ల కొన్ని వ్యాధుల సంఖ్య తగ్గింది. కాచి వడబోసిన నీటిని తాగడం వల్ల టైపాయిడ్, పచ్చకామెర్లు వంటి వాటికి దూరంగా ఉంటున్నారు. ఈయేడాది జనవరిలో ఫీవరాసుపత్రికి సీజనల్ వ్యాధులతో వచ్చినవారు 661 మంది కాగా, ఫిబ్రవరిలో 676, మార్చి 553, ఏప్రిల్‌లో 137 మంది రావడం గమనార్హం. ఇవి 2019 కంటే తక్కువేనని అధికారులు చెబుతున్నారు.