కర్నూలు జిల్లా నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనపై సీబీఐ దర్యాప్తు లేదా.. జ్యుడీషీయల్ విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. విజయవాడలో అబ్దుల్ సలాం న్యాయ పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో అఖిలపక్ష పార్టీలు, ముస్లిం సంఘాల నాయకులు పాల్గొని సలాం కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి జగన్ ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోవాలని.. వైకాపా అధికారంలోకి రావడానికి కారణమైన ముస్లిం ప్రజలపైనే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. భాజపా అధ్యక్షులు సోము వీర్రాజు మానవత్వం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సలాం ఆత్మహత్యకు పోలీసుల ఓవర్ యాక్షన్ కారణమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు విమర్శించారు.
సలాం కుటుంబానికి న్యాయం చేయమని అడుగుతున్న వారిపై బెదిరింపులకు పాల్పడుతున్నారని.. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని తెదేపా అధికార ప్రతినిధి నాగుల్ మీరా, ముస్లిం లీగ్ పార్టీ నాయకులు బషీర్ డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:
ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదంటూ.. ఎన్నికల కమిషనర్‌కు.. సీఎస్ లేఖ