72వ గణతంత్ర దినోత్సవాన్ని కృష్ణాజిల్లాలో ఘనంగా నిర్వహించారు. భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌కు.. పలువురు అధికారులు, తెదేపా నేతలు పాలాభిషేకాలు, పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
విజయవాడలో...
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో.. తెదేపా ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వర రావు తనయుడు రవితేజ పాల్గొని జెండా ఎగరవేశారు. స్థానిక ఎన్నికలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తూ.. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్రపటానికి రవితేజ పాలభిషేకం చేశారు. నేటి యువతకు మన రాజ్యాంగం పట్ల మరింత గౌరవం పెరిగేలా చేసిందని ప్రశంసించారు.
గన్నవరంలో...
మూసుకుపోయిన వైకాపా ప్రభుత్వం కళ్లను.. న్యాయవ్యవస్థ తెరిపించిందని తెదేపా ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు విమర్శించారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని.. డా. బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి గన్నవరంలో పాలాభిషేకం చేశారు.
నూజివీడులో...
భారత దేశ సార్వభౌమత్వాన్ని, సమైక్యతను, గౌరవాన్ని.. ప్రతి భారతీయుడు కాపాడాలని నూజివీడు సబ్ కలెక్టర్ ప్రతిష్ట మాంగైన్ పిలుపునిచ్చారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కార్యాలయం ఆవరణంలో త్రివర్ణ పతకాన్ని ఆవిష్కరించారు. ప్రజలందరి సహకారంతో కరోనాను జయించామని.. రాబోయే కాలంలో నిర్వహించ తలపెట్టిన స్థానిక ఎన్నికలను శాంతియుతంగా జరగడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన నేతలు, సరిహద్దుల్లో అనుక్షణం పోరాడే సైనికుల కోసం నిత్యం ప్రార్థనలు చేయాలని కోరారు.
నందిగామలో...
నందిగామ రైతుపేటలోని తెదేపా కార్యాలయంలో.. 72వ గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించారు. పార్టీ నేతలతో కలిసి మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలకు స్వేచ్ఛ, అధికారం, హక్కులు కల్పిస్తూ ఏర్పడిన రాజ్యాంగం అమలులోకి వచ్చిన జనవరి 26ను.. గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నామని గుర్తు చేశారు. ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తూ.. గాంధీ సెంటర్లోని అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళులు అర్పించారు.
ఇదీ చదవండి: ఆ ఇద్దరూ విధి నిర్వహణలో ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం వహించారు: ఎస్ఈసీ