కరోనా వైరస్ వ్యాప్తిని నివారించి, ప్రస్తుత సంక్షోభ పరిస్థితి నుంచి బయటకు తీసుకురావటంలో రెడ్ క్రాస్ సొసైటీ కీలక భూమిక పోషించాలని గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ కోరారు. ప్రస్తుత పరిస్థితుల్లో రెడ్ క్రాస్ ఎలాంటి పాత్ర పోషించాలన్న దానిపై ఆ సంస్థ బాధ్యులకు గవర్నర్ దిశానిర్దేశం చేశారు. రాజ్ భవన్లో ప్రత్యేక సమావేశం నిర్వహించిన గవర్నర్... రెడ్ క్రాస్ సొసైటీని పూర్తి స్థాయిలో సమాయత్తం చేయాలన్నారు. ఇప్పటికే చేపడుతున్న వివిధ కార్యక్రమాలను గురించి రాష్ట్ర రెడ్ క్రాస్ ఛైర్మన్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి...గవర్నర్కు వివరించారు.
కోవిడ్ -19 నివారణకు సంబంధించి చేయాల్సిన, చేయకూడని వాటి గురించి అవగాహన కల్పించే ప్రక్రియలో చురుగ్గా పాల్గొంటున్నామని గవర్నర్కు రెడ్ క్రాస్ ప్రతినిధులు వివరించారు. వాలంటీర్ల ద్వారా సాధారణ ప్రజలు, కరోనా విధుల్లో పాల్గొన్న అధికారులు, సిబ్బందికి మాస్క్లు పంపిణీ చేస్తున్నామని గవర్నర్ దృష్టికి తీసుకువచ్చారు. పోలీసు, ఇతర ప్రభుత్వ అధికారుల సమన్వయంతో ప్రజలు ఇంట్లోనే ఉండేలా అవగాహన కల్పిస్తున్నామన్నారు.
టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు
ఏపీఆర్సీ టోల్ ఫ్రీ నంబర్ 1800-425-1234 ను ప్రారంభించి అవసరమైన వ్యక్తులకు సహాయం అందిస్తున్నామని రెడ్ క్రాస్ ప్రతినిధులు గవర్నర్కు స్పష్టం చేశారు. సహాయ చర్యల కోసం వైద్యులు, నర్సులు, వాలంటీర్లను సమకూర్చుకుంటున్నామని తెలిపారు.
నిరాశ్రయులను ఆదుకోండి...
వైరస్ వ్యాప్తి చెందకుండా అనుసరించాల్సిన జాగ్రత్తలపై కరపత్రాలు ముద్రించి ప్రజలకు పంపిణీ చేయాలని గవర్నర్ సూచించారు. నిరాశ్రయులైన ప్రజలు, బిచ్చగాళ్లకు...ఆహారం, నీటి పాకెట్లు పంపిణీ చేయాలన్నారు. సామాజిక దూరం పాటిస్తూ.. కరోనా వ్యాప్తి నివారణకు సంబంధించి భారీ అవగాహన కార్యక్రమాలు రూపొందించాలన్నారు.
ఇదీచదవండి