Rare heart surgery: పుట్టుకతోనే గుండె సహా కుడివైపు అవయవాలన్నీ ఎడమవైపు, ఎడమపక్క అవయవాలన్నీ కుడిపక్కన ఉండటంతో పాటు, గుండెలో పెద్ద రంధ్రం ఉన్న నాలుగేళ్ల బాలుడికి విజయవాడలోని ఆంధ్రా హార్ట్ అండ్ బ్రెయిన్ హాస్పిటల్ వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు. కాకినాడ జిల్లా కిర్లంపూడికి చెందిన తరుణ్ అనే ఆ బాలుడికి ‘ఇంటరప్టెడ్ ఐవీసీ’ అనే సమస్య కూడా ఉంది.
హృద్రోగ శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్ ఆర్.దిలీప్ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం కీహోల్ విధానంలో విజయవంతంగా శస్త్రచికిత్స చేశారు. అలాంటి అరుదైన సమస్యలున్న, అంత చిన్న వయసు పిల్లలకు కీహోల్ విధానంలో సంక్లిష్టమైన శస్త్రచికిత్స చేయడం ఇదే మొదటిసారని డాక్టర్ దిలీప్, హృద్రోగ నిపుణుడు డాక్టర్ విక్రమ్ ‘ఈనాడు-ఈటీవీకి’ తెలిపారు.
బాలుడికి ఉన్న సమస్యలను, చేసిన చికిత్స విధానాన్ని ఇలా వివరించారు.. ‘ఎడమపక్క అవయవాలు కుడిపక్క, కుడివైపు అవయవాలు ఎడమవైపు ఉండటాన్ని వైద్య పరిభాషలో ‘సైటస్ ఇన్‌వర్సెస్ టొటాలిస్’ అంటారు. అది పెద్ద సమస్య కాదు. కానీ తరుణ్‌కి గుండె గదులు కూడా రివర్స్‌లో ఉండటంతో పాటు, పై గదుల్లో పెద్ద రంధ్రం ఉంది. పిల్లలకు గుండెలో చిన్న రంధ్రం ఉంటే... కాలినుంచి రక్తనాళాల ద్వారా వైరు సాయంతో బటన్ (ప్రత్యేక పరికరం) పంపించి దాన్ని పూడ్చేస్తాం.
తరుణ్‌కి గుండెలో పెద్ద రంధ్రం ఉండటంతో పాటు, ఆ పరికరాన్ని పట్టి ఉంచేందుకు మార్జిన్స్ లేవు. అందువల్ల బటన్‌తో రంధ్రాన్ని పూడ్చే పరిస్థితి లేదు. పైగా అతనికి మరో అరుదైన సమస్య ఉంది. సాధారణంగా కాళ్లు, కాలేయం వంటి శరీరంలోని కింది భాగాల నుంచి చెడురక్తాన్ని గుండెకు తీసుకొచ్చే... ఇన్ఫీరియర్ వీనకావా (ఐవీసీ) అనే సిర కింది భాగమే గుండెలోకి తెరుచుకుంటుంది. బాలుడికి అలాకాకుండా.. వెనక నుంచి పైకి వెళ్లి, మెడ భాగంలో సుపీరియర్ వీనకావా (ఎస్‌వీసీ) అనే ప్రధాన సిరలోకి ఓపెన్ అవుతోంది. దాంతో ఆపరేషన్ సంక్లిష్టమైంది’ అని డాక్టర్ దిలీప్ వివరించారు.
‘సాధారణ కోత విధానంలో శస్త్రచికిత్స తేలిక. కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఆ ఇబ్బందులు ఉండకూడదనే కీహోల్ సర్జరీ చేశాం. ఇకపై బాలుడు మిగతా పిల్లల్లాగే సాధారణ జీవితం గడపొచ్చు. పెద్దయ్యాక శారీరక శ్రమ ఎక్కువ ఉండే ఉద్యోగాలూ చేయవచ్చు’ అని దిలీప్ వివరించారు. ‘ఆరోగ్య శ్రీ’ కింద శస్త్రచికిత్స చేశామన్నారు.
ఇవీ చూడండి: