స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్‌తో చిత్రీకరించిన ప్రకటన(allu arjun rapido ad)పై తెలంగాణ ఆర్టీసీ ఇచ్చిన నోటీసుల(tsrtc notices to rapido)కు ర్యాపిడో స్పందించింది. ఆర్టీసీ ప్రతిష్ఠను దిగజార్చేలా ప్రకటన ఉందన్న విమర్శలపై ర్యాపిడో సంస్థ వెనక్కి తగ్గింది. అల్లు అర్జున్ నటించిన ఈ ప్రకటనపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆర్టీసీ ఎండీ సజ్జనార్.. బన్నీకి, రాపిడో సంస్థకు ఈ నెల 9న లీగల్ నోటీసులు పంపారు. ఈ ప్రకటనలో ఆర్టీసీ బస్సులను ప్రతికూలంగా చూపించడాన్ని ఖండిస్తున్నట్టు సజ్జనార్ తెలిపారు. టీఎస్ ఆర్టీసీ ఎన్నో ఏళ్లుగా సామాన్యుల సేవలో ఉందని.. అలాంటి సంస్థను కించపర్చినందుకే రాపిడోకు, అల్లు అర్జున్‌కు నోటీసులు ఇచ్చినట్టు సజ్జనార్ పేర్కొన్నారు. లీగల్ నోటీసులకు ఎట్టకేలకు స్పందించిన ర్యాపిడో.. యాడ్‌లో కొన్ని మార్పులు చేసింది.
ఆ దృశ్యాలు, డైలాగులను..
రాపిడో సంస్థ ఇటీవలే విడుదల చేసిన ప్రకటన(Allu Arjun MASS Rapido AD)లో అల్లు అర్జున్ నటించాడు. అందులో.. దోశలు వేసే వ్యక్తిగా బన్నీ కనిపించాడు. రాపిడోను ప్రమోట్ చేసే క్రమంలో.. బస్సు ప్రయాణాన్ని దోశతో పోల్చుతూ సంభాషణలు చెప్తాడు. బస్సుల్లో ప్రయాణం చేయటం వల్ల జనాలు ఇబ్బంది పడుతున్నారని.. ఎలాంటి ప్రయాసలు లేకుండా వేగంగా, సురక్షితంగా వెళ్లేందుకు రాపిడో సేవలను ఉపయోగించుకోవాలని ఆ ప్రకటన సారాంశం. అయితే.. నోటీసులకు స్పందించిన సంస్థ.. ఏ దృశ్యాలైతే విమర్శలకు దారి తీశాయో వాటిని తొలగించాలని నిర్ణయించింది. ప్రకటనలో ఆర్టీసీ బస్సులను చూపిస్తూ చిత్రీకరించిన అభ్యంతరకర దృశ్యాలను.. వాటితో పాటు ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని చులకనగా, కించపరిచేలా ఉన్న బన్నీ డైలాగులను తొలగించింది.
మిశ్రమ కామెంట్లు...
ర్యాపిడో ప్రకటనపై ఆర్టీసీ ఉద్యోగులు, ప్రయాణికుల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. మూడు రోజులుగా ఈ వివాదంపై సోషల్ మీడియాలో తీవ్రంగా చర్చసాగింది. ఎన్నో ఏళ్ల నుంచి సామాన్య ప్రజలకు సేవలందిస్తోన్న ఆర్టీసీ సంస్థను చులకనగా చేసి, కించపరిచేలా మాట్లాడటం సరైన వ్యాపార వ్యూహం కాదని ఆ సంస్థ ఎండీ సజ్జనార్ చేసి వ్యాఖ్యలకు నెటిజన్లు కూడా పెద్ద సంఖ్యలో మద్దతు తెలిపారు. మరోవైపు.. ఈ ప్రకటనలో నిజమే చూపించారని.. ఉన్న సమస్యను చెప్తే కూడా లీగల్ నోటీసులు పంపిస్తారా...? అంటూ కొందరు రివర్స్ కామెంట్లు కూడా చేశారు.
ర్యాపిడోకు కూడా లాభమే..
ఏలాగైతేనేం.. చివరికి ర్యాపిడో దిగొచ్చింది. ప్రజారవాణా వ్యవస్థను గౌరవిస్తూ.. తమ ప్రకటనలోని సన్నివేశాలను తొలగించింది. ఈ వివాదం కారణంగా.. ర్యాపిడోకు ఫ్రీ పబ్లిసిటీ దొరికినట్టైంది. తాము చేసుకునే ప్రచారం కన్నా.. రెండింతలు ఎక్కువే జనాల్లోకి వెళ్లింది. ఈ పరిణామం.. ర్యాపిడోకు వ్యాపారపరంగా మంచి బిజినెస్ స్ట్రాటజీగా కూడా పనికొచ్చిందన్న కామెంట్లు కూడా వస్తున్నాయి. ఎటు చేసి ర్యాపిడోకు లాభమే జరిగిందంటున్నారు నెటిజన్లు..!!
సంబంధిత కథనం..