విజయవాడ రైల్వేస్టేషన్‌లో గత నెలలో అక్రమ సరకును భారీగా పట్టుకున్నారు. కోల్‌కతా నుంచి పన్నులు చెల్లించకుండా తీసుకొస్తున్న రూ.5 కోట్ల విలువైన రెడీమేడ్ దుస్తులను రాష్ట్ర పన్నుల శాఖ విజయవాడ 2 డివిజన్ సిబ్బంది పట్టుకున్నారు. దొంగ సరకు భారీగా వస్తోందనే సమాచారంతో మూడు రోజులు రైల్వేస్టేషన్‌లో నిఘా ఉంచడంతో ఈ సరకు దొరికింది. పన్నులు చెల్లించకుండా విజయవాడకు తీసుకొచ్చిన సరకును అడ్డదారిలో తరలించేందుకు ప్రయత్నిస్తూ.. ఇద్దరు చీఫ్ పార్శిల్ సూపర్‌వైజర్లు దొరికారు. 400కు పైగా బోరేలను పన్నులు చెల్లించకుండా తీసుకొస్తున్నట్టు గుర్తించారు. దొంగ సరకును విజయవాడలోని రామవరప్పాడులో ఉన్న ఓ గోదాములో భద్రపరిచారు. సరకు యజమానులను గుర్తించి, వారి నుంచి పన్ను వసూలు చేస్తున్నారు. ఇప్పటికీ ఈ ప్రక్రియ సాగుతూనే ఉంది. ఇప్పటివరకు రూ.40లక్షలకు పైగా పన్నును రాబట్టారు. మరో రూ.30లక్షలకు పైగా వస్తుందని అధికారులు భావిస్తున్నారు.
సీజ్ చేసేందుకూ అంగీకరించక..
దొంగ సరకు విజయవాడ రైల్వేస్టేషన్ కేంద్రంగా తరలిపోవడానికి.. కొందరు పార్శిల్ కార్యాలయం సిబ్బంది సహకారమే కారణమనే ఆరోపణలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. అందుకే.. తమకు రైల్వే పార్శిల్ సిబ్బంది అస్సలు సహకారం అందించరని.. పన్నులశాఖ అధికారులు చాలాకాలంగా ఫిర్యాదు చేస్తున్నారు. తాజాగా మూడు బోగీల్లో వచ్చిన రెడీమేడ్ సరకును పట్టుకున్నారు. విజయవాడ రైల్వేస్టేషన్‌లోని పార్శిల్ కార్యాలయం పక్కనున్న ప్లాట్‌ఫాంపై సరకును ఉంచారు. దానిని సీజ్ చేసి తీసుకెళ్లేందుకు పన్నుల అధికారులు ప్రయత్నించగా రైల్వే సిబ్బంది అంగీకరించలేదు. దీంతో రెండు రోజులు సరకును రైల్వేస్టేషన్ ప్లాట్‌ఫాంపైనే ఉంచి.. పన్నుల అధికారులు పహారా కాశారు. చివరికి సరకు దొరికిన విషయం బయటకు పొక్కడంతో.. రైల్వేసిబ్బంది పక్కకు తప్పుకున్నారు.
రెడీమేడ్ దుస్తులు, ఎలక్ట్రానిక్ గూడ్స్..
కోల్‌కతా నుంచి రెడీమేడ్ దుస్తులు, మహారాష్ట్ర, దిల్లీ నుంచి ఇత్తడి పాత్రలు, బొమ్మలు, మిక్సీలు, కుక్కర్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు, విదేశీ సిగరెట్లు అక్రమంగా ఇక్కడికి దిగుమతి అవుతుంటాయి. ప్రత్యేకంగా రైల్వే బోగీలను బుక్‌చేసి మరీ విజయవాడకు చెందిన కొందరు దళారులు సరకును తెప్పిస్తుంటారు. పండుగల వేళ రూ.కోట్ల విలువైన దొంగ సరకు విజయవాడ రైల్వేస్టేషన్ కేంద్రంగా బయటకు తరలిపోతుంటుంది. తాజాగా రూ.5 కోట్ల విలువైన సరకు దొరకడంతో.. రైల్వే విజిలెన్స్ సిబ్బంది ఇక్కడ దృష్టిపెట్టారు. ఆకస్మికంగా తనిఖీ చేయగా.. ముగ్గురు సిబ్బంది దొరికారు.
ఇదీ చదవండి: