విజయసాయిరెడ్డి రాసిన లేఖకు ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. రిజిస్టరైన పార్టీ కాకుండా మరో పార్టీ లెటర్ హెడ్‌తో నోటీసు వచ్చిందని జగన్‌కు తెలిపారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పేరును వాడుకోవద్దని ఈసీ చెప్పిందన్నారు. పలు సందర్భాల్లో ఈసీ పార్టీకి రాసిన లేఖలు దీన్ని స్పష్టం చేస్తున్నాయన్నారు.
ఏ సందర్భంలోనూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అని వాడుకునేందుకు అవకాశం లేదని ఈసీ చెప్పింది. నేను వెంకటేశ్వరస్వామి అపర భక్తుణ్ని. స్వామివారి ఆస్తుల అమ్మకం అంశంలో భక్తుల మనోభావాలను వివరించా. స్వామివారి ఆస్తుల అమ్మకం వ్యవహారంలో హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నట్లు చెప్పా. హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నట్లు మాత్రమే చెప్పాను. నేను ఎక్కడా పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించలేదు. మిమ్మల్ని కలిసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతున్నాను.
-ఎంపీ రఘురామకృష్ణరాజు
వంటకాలు రుచి చూపించేందుకే.. డిన్నర్
వ్యక్తిగత భద్రత అంశంపై స్పీకర్, హోంమంత్రిని కలిశానని రఘురామకృష్ణరాజు తెలిపారు. కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలని కోరినట్లు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా వంటకాలు ఎంపీలకు రుచి చూపించాలనుకున్నానని... ఆ ఉద్దేశంతోనే దిల్లీలో డిన్నర్ మీటింగ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నమ్మకమైన పార్టీ సైనికుడిగా ఉన్నా.. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ బద్ధుడినే స్పష్టం చేశారు. పార్టీ నియమాలు దాటి ఎప్పుడూ ముందుకెళ్లలేదన్నారు.
నన్ను మీతో కలవకుండా చేస్తున్నారు..
ఇసుక విధానం, ఇసుక లూటీపై మాట్లాడానని ప్రశ్నించారు. 2లక్షల ఇసుక పక్కదారి పట్టిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పాకే తాను ఆవిషయం ప్రస్తావించినట్లు కృష్ణరాజు లేఖలో తెలిపారు. ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి అవకతవకలు జరుగుతున్నాయని, నియంత్రించాలని గృహ నిర్మాణ శాఖ మంత్రి రంగనాథరాజు పశ్చిమ గోదావరి జిల్లా అధికారులను ఆదేశించారన్నారు. ఆ తర్వాతే ఆ విషయం గురించి మాట్లాడినట్లు ఆయన స్పష్టం చేశారు. కాని నేనొక్కడినే మాట్లాడినట్లు సామాజిక మాధ్యమాల్లో కథనాలు ప్రచారం చేశారు. దీనికి మన సోషల్ మీడియా హెడ్ సలహానే కారణం. ఓ వెబ్ పోర్టల్ విషయంలో అధీకృత ఆధారాలతో లోక్ సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశాను. మీరెందుకు ఆ పోర్టల్‌పై సభాహక్కుల ఉల్లంఘన పెడుతున్నారని విజయసాయి రెడ్డి లేఖలో నన్ను ప్రశ్నించారు. ఇది ఒక ఎంపీ విధులను ఆటంకపరిచే తీవ్రమైన చర్య. నియోజక వర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు తన దిష్టిబొమ్మను దహనం చేయమని చెప్పటం... నియోజక వర్గానికి వస్తే భౌతిక హాని తప్పదని హెచ్చరించటం బాధ కలిగించింది. స్థానికుల హెచ్చరికలతో పాటు బయట జిల్లాల నుంచి ప్రధానంగా రాయలసీమ నుంచి బెదిరింపు కాల్స్ వచ్చాయి. విదేశీ నంబర్ల నుంచీ ఫోన్లు చేసి బెదిరించారు. రక్షణ కల్పించాలని స్థానిక పోలీసులు, జిల్లా పోలీసు అధికారులు, డీజీపీని కోరినా వారు పట్టించుకోలేదు. . అందువల్లే లోక్‌సభ స్పీకరును, కేంద్ర హోం మంత్రిని ఆశ్రయించాను. మీ చుట్టూ ఉన్న కొందరు నన్ను క్రైస్తవ వ్యతిరేకిగా చిత్రీకరించారు. ఓ ప్రజాప్రతినిధి మిమ్మల్ని కలవకుండా చేస్తున్నదీ వారే. లౌకిక దేశంలో అన్ని మతాల మనోభావాలనూ గౌరవించాల్సిన బాధ్యత మనపై ఉంది. దాని దృష్ట్యానే హిందువుల మనోభావాలను తెలియజేసేందుకు ప్రయత్నించాను. షోకాజ్ నోటీసులో వీటికి కూడా వివరణ అడిగారు.
రాజ్యాంగంపై ప్రమాణం చేస్తూ ఎంపీగా బాధ్యతలు చేపట్టా. రాజ్యాంగం కల్పించిన భాష, హక్కుల మేరకే లోక్‌సభలో స్పందించా. దీనిలో ఎక్కడా తప్పుపట్టాల్సిన అంశం లేదు. అయినా షోకాజ్ నోటీసులో ఈ విషయం ప్రస్తావించారు. పార్లమెంటులో మాట్లాడిన దానిపై చర్చించేందుకు రావాలని మీరే పిలిచారు.' అని జగన్‌కు రాసిన లేఖలో రఘురామకృష్ణరాజు ప్రస్తావించారు.
ఇదీ చదవండి: జులై 1న కొత్త అంబులెన్స్‌లు ప్రారంభించనున్న సీఎం జగన్