రాష్ట్రంలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పరీక్ష ఫలితాలను రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత విడుదల చేశారు. 50 మందిని ఏపీపీలుగా ఎంపిక చేశారు. ఇందులో 27 మంది మహిళలు ఉండటం విశేషం. 2013లో సమైక్య రాష్ట్రంగా ఉండగా ఏపీపీలను నియమించామని... ఇప్పుడు మళ్లీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పోస్టులను భర్తీ చేసినట్టు మంత్రి వెల్లడించారు. డీజీపీ గౌతమ్ సవాంగ్, పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ఛైర్మన్ అమిత్ గార్గ్‌లతో కలిసి మంత్రి ఫలితాలను వెలువరించారు. ఏపీపీలకు ఒంగోలు పోలీసు ట్రైనింగ్ కళాశాలలో శిక్షణ ఇస్తామని తెలిపారు.
రోజూ 4 వేల కాల్స్ వస్తున్నాయి: డీజీపీ
విభజన చట్టం ప్రకారం ఏపీ పోలీసు అకాడమీని కేటాయించాల్సిందిగా కేంద్రాన్ని కోరామని మంత్రి సుచరిత వెల్లడించారు. మరోవైపు వేకెన్సీ రిజర్వులో ఉన్న వారికి జీతాలు నిలుపుదల చేశారంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు వ్యవహారాన్ని కేంద్రానికి నివేదించామని.. అయితే ప్రస్తుతం ఈ అంశం కోర్టులో ఉన్నందున వివరాలను వెల్లడించేందుకు వీలు కాదని అన్నారు. దిశ చట్టం రాష్ట్రంలో చక్కగా అమలు అవుతోందని.. ప్రతీ పోలీస్ స్టేషన్ మహిళల సమస్యల పట్ల సత్వరమే స్పందించేలా తీర్చిదిద్దటమే తమ లక్ష్యమని డీజీపీ వెల్లడించారు. రోజూ నాలుగు వేల వరకూ కాల్స్ వస్తున్నాయని తెలిపారు. కాల్‌మనీ కేసులు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎక్కువని.. గతంలో నమోదైన కేసుల దర్యాప్తు జరుగుతోందని సవాంగ్ తెలిపారు. మనీ లెండింగ్ యాక్ట్ తేవాలని ఆలోచన చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఇవీ చదవండి: