Disha: స్పెషల్ కోర్టుల ఏర్పాటుకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ దిశ బిల్లులోని నిబంధనలను పునఃసమీక్షించాలని కేంద్ర న్యాయశాఖ సూచించిందని.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్ర వెల్లడించారు. మహిళ, శిశు సంక్షేమశాఖతో సంప్రదించి ఆ పని చేయాలని సలహా ఇచ్చినట్లు పేర్కొన్నారు. మంగళవారం లోక్‌సభలో తెదేపా, వైకాపా ఎంపీలు రామ్మోహన్ నాయుడు, వంగ గీతలు అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు.
‘ది ఆంధ్రప్రదేశ్ దిశ బిల్లు- క్రిమినల్ లా (ఏపీ అమెండెంట్‌మెంట్) బిల్లు 2019, ఏపీ దిశ (స్పెషల్‌కోర్ట్స్ ఫర్ స్పెసిఫైడ్ అఫెన్సెస్ అగెనెస్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్) బిల్లు 2020లు రాష్ట్రపతి ఆమోదముద్ర కోసం వచ్చాయి. ఇలాంటి బిల్లులను సంబంధిత నోడల్ మంత్రిత్వశాఖలతో సంప్రదించి తదుపరి కార్యాచరణ చేపట్టడం సంప్రదాయంగా వస్తోంది. 2019నాటి బిల్లుపై వివిధ కేంద్ర మంత్రిత్వశాఖలు, డిపార్టుమెంట్లు వ్యక్తం చేసిన అభిప్రాయాలను ఏపీ ప్రభుత్వానికి 2020 సెప్టెంబరు 30, 2021 ఫిబ్రవరి 19, 2021 జులై 1, 2021 జులై 27, 2021 అక్టోబర్ 29వ తేదీల్లో పంపాం.
ఈ అభిప్రాయాలపై ఏపీ ప్రభుత్వం వేర్వేరు తేదీల్లో వివరణలు పంపింది. కేంద్ర హోంశాఖలోని మహిళా భద్రత డివిజన్ వ్యక్తం చేసిన అభిప్రాయాలను ఈ ఏడాది మే 31న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వివరణ కోసం పంపాం. స్పెషల్ కోర్టులకు సంబంధించిన 2020 బిల్లుపై వివిధ మంత్రిత్వశాఖలు వ్యక్తం చేసిన అభిప్రాయాలను గత ఏడాది జులై 2న ఏపీ ప్రభుత్వానికి పంపాం. అక్టోబరు 1న అక్కడి నుంచి వివరణ వచ్చింది.
మహిళా శిశు సంక్షేమశాఖతో సంప్రదించి ఈ బిల్లులోని నిబంధనలను పునఃసమీక్షించాలని న్యాయశాఖ సూచించింది. ఆ అభిప్రాయాలను మహిళా శిశు సంక్షేమశాఖ, హోంశాఖలోని మహిళా భద్రతా విభాగానికి ఈ ఏడాది మార్చి 4న పంపాం. ఈ అంశాన్ని మరింత వేగవంతం చేయడానికి ఈనెల 17న ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు, కేంద్రంలోని నోడల్ మంత్రిత్వశాఖ, డిపార్ట్‌మెంట్లతో సమావేశం నిర్వహించాం’ అని కేంద్ర మంత్రి అజయ్ మిశ్ర వివరించారు.
ఇవీ చూడండి: సుప్రీం వద్దన్నచోటా అంతస్తులు.. ఇదీ 'వైజాగ్ రుషికొండ' వద్ద పనుల తీరు!