President Ramnath Unveiled Gold statue of Ramanuja: రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని సమతామూర్తి కేంద్రంలో.. జగద్గురు రామానుజాచార్యుల వెయ్యేళ్ల పండుగ శోభాయమానంగా సాగుతోంది. 54 అడుగుల సమతామూర్తి 120 కిలోల స్వర్ణ ప్రతిమను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆవిష్కరించి.. లోకార్పణం చేశారు. స్వర్ణమూర్తి వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ పేరుతో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సమతామూర్తి బంగారు విగ్రహానికి రాష్ట్రపతి దంపతులు ప్రత్యేక పూజలు చేసి తొలి హారతి ఇచ్చారు. బంగారు శఠారితో రాష్ట్రపతిని చినజీయర్ స్వామిని ఆశీర్వదించారు. భద్రవేదిలోని మొదటి అంతస్తులో జరిగిన ఈ కార్యక్రమంలో.. వేలాది మంది రుత్వికులు వేద మంత్రోచ్ఛారణలతో ఘోషించారు. రాష్ట్రపతితో పాటు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, మంత్రి తలసాని శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఎన్నో ప్రత్యేకతలు..
విగ్రహావిష్కరణకు ముందుగా సమతామూర్తి కేంద్రంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.. 216 అడుగుల రామానుజ విగ్రహాన్ని సందర్శించారు. దివ్యక్షేత్రంలోని 108 వైష్ణవ ఆలయాలను దర్శించుకున్నారు. సమతాస్ఫూర్తి కేంద్రం విశేషాలను రాష్ట్రపతికి చినజీయర్‌స్వామి వివరించారు. ఇక బంగారు సమతామూర్తి విగ్రహానికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. విగ్రహాన్ని పూర్తిగా ముచ్చింతల్‌లోని జీవాశ్రమంలోనే తయారు చేశారు. మైహోం గ్రూపు అధినేత జూపల్లి రామేశ్వరరావు 27 కిలోల బంగారాన్ని విరాళమిచ్చారు. అమెరికాకు చెందిన మరో భక్తురాలు 8 కిలోలు అందించారు. ఆశ్రమంలో పనిచేసే కార్మికులు తమ వంతుగా సహాయం చేశారు. ఇలా ఎందరో విరాళంగా ఇచ్చిన బంగారంతో ప్రతిమను రూపొందించారు. విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని రామానుజులు విశ్వవ్యాప్తం చేశారు. సర్వమానవ సమానత్వ సూత్రం ప్రబోధించారు.
విహంగ వీక్షణం..
బేగంపేట విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో చేరుకున్న రాష్ట్రపతికి.. గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆర్మీ హెలికాప్టర్లో ముచ్చింతల్‌కు బయలుదేరిన రాష్ట్రపతి దంపతులు.. విహంగ వీక్షణం ద్వారా సమతామూర్తిని తిలకించారు. మధ్యాహ్నం 3.30 గంటలకు కేంద్రానికి చేరుకున్న రాష్ట్రపతికి.. చినజీయర్ స్వామి స్వాగతం పలికారు. రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా ముచ్చింతల్ పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేశారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ముచ్చింతల్ వరకు సుమారు 7000 మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహించారు. భక్తులకు, సందర్శకులకు మధ్యాహ్నం ఒంటి గంట వరకే అనుమతి ఇచ్చారు.
ఇదీ చదవండి:
Ramanuja Statue: 120 ఏళ్ల పరిపూర్ణ జీవనానికి ప్రతీక 120 కిలోల సువర్ణ విగ్రహం