ఇకపై గుడ్డ సంచులకు మాత్రమే అనుమతి
విజయవాడ ఇంద్రకీలాద్రి ప్రముఖ పుణ్య క్షేత్రాల్లో ఒకటి. రోజూ అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనానికి వస్తుంటారు. ఉత్సవాలు, సెలవుల సమయంలో రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి రోజుల్లో ప్లాస్టిక్ వాడకం సైతం అధికంగా ఉంటుంది. చాలా మంది భక్తులు పూజా వస్తువులను ప్లాస్టిక్ సంచుల్లో తెస్తారు. కానీ ఇప్పటి నుంచి ఆలయ ప్రాంగణంలో గుడ్డ సంచులు మాత్రమే అనుమతించనున్నారు. గతంలో కోటేశ్వరమ్మ ఆలయ ఈవోగా ఉన్నప్పుడు అమ్మవారికి సమర్పించే చీరల నుంచి గుడ్డ సంచులను తయారు చేయాలని ఆమె ఆలయ సిబ్బందిని ఆదేశించారు. అయితే ఈ నిర్ణయంతో ఆలయ ఆదాయం విషయంలో విభేదాలు తలెత్తాయి. అయితే ప్రస్తుత ఈవో సురేష్ బాబు, ముందుగానే తగినంత సంఖ్యలో గుడ్డ సంచులను ఆర్డర్ చేశారు. ప్లాస్టిక్ సంచులను అమ్మవద్దని ఆలయ ప్రాంగణంలోని విక్రేతలకు ఆదేశాలు జారీ చేశారు. ఇంద్రకీలాద్రిపై పూర్తి స్థాయిలో ప్లాస్టిక్ నిషేధం అమలు చేస్తామని స్పష్టం చేశారు. మహా మండపం ఐదో అంతస్తులోని వ్యాపారస్థులు తమ దుకాణాల్లో ప్లాస్టిక్ వాడటం మానేశారు. ప్లాస్టిక్ రహితంగా మార్చడానికి అధికారులు తీసుకున్న చర్యలపై పర్యావరణ వేత్తలు, భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి: