Ministers meeting on Amaravati : రాజధాని అమరావతిలో భూ కేటాయింపులపై సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. రాజధానిలో పలు సంస్థలకు భూ కేటాయింపులపై మంత్రుల కమిటీ నిర్ణయం తీసుకోనుంది. మంత్రులు పయ్యావుల కేశవ్, నారాయణ, కొల్లు రవీంద్ర, కందుల దుర్గేశ్, టీజీ భరత్ సబ్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.
ప్రభుత్వాన్ని సంప్రదించిన 115కు పైగా సంస్థలు: గతంలో రాజధాని ప్రాంతంలో భూ కేటాయింపులు చేసిన సంస్థల ప్రస్తుత పరిస్థితిపై పరిశీలన చేయనున్నారు. కొత్తగా వచ్చే సంస్థలకు చేయాల్సిన కేటాయింపులు, ప్రపంచ స్థాయి సంస్థలను అమరావతికి తీసుకురావడంపై కమిటీ చర్చించనుంది. గతంలో 120 పైగా సంస్థలకు చంద్రబాబు ప్రభుత్వం భూ కేటాయింపులు చేసింది. ప్రస్తుతం రాజధానిలో మళ్లీ భవనాలు నిర్మాణాన్ని పునః ప్రారంభిస్తామని 115 కు పైగా సంస్థలు ప్రభుత్వాన్ని సంప్రదించాయి.
మహానగరికి మహర్దశ - నవ రాజధానికి రూ.3,445 కోట్లు
కేబినెట్‌లో చర్చించి రీటెండరింగ్‌పై నిర్ణయం: సమావేశం అనంతరం మంత్రులు వివరాలను వెల్లడించారు. గతంలో చాలా సంస్థలకు రాజధాని పరిధిలో భూ కేటాయింపులు జరిగాయని పురపాలక శాఖ మంత్రి నారాయణ (Ponguru Narayana) అన్నారు. గత ప్రభుత్వం పనులు నిలిపేసినందున ఏం జరుగుతుందో తెలియక ఎవరూ ముందుకు రాలేదని, అమరావతిలో నిర్మాణ పనులపై తదుపరి నిర్ణయం త్వరలోనే తీసుకుంటామని స్పష్టం చేశారు. 18వ తేదీన కేబినెట్‌లో ఈ అంశాన్ని చర్చించి, రీ టెండరింగ్ అంశాలపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇప్పటికే కొన్ని సంస్థలు ప్రభుత్వాన్ని సంప్రదించి పనులు పునః ప్రారంభానికి ఆసక్తి చూపాయన్నారు.
పనులు జరుగుతున్న కొద్దీ మరిన్ని సంస్థలు వస్తాయి: రాజధానిలో భూకేటాయింపులపై మంత్రుల కమిటీ తొలి భేటీ జరిగిందని మంత్రి పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) తెలిపారు. భూములు కేటాయించిన సంస్థల్లో ఎవరు ఆసక్తిగా ఉన్నారన్న అంశం పరిశీలిస్తున్నామని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. సీఆర్డిఏ పరిధిలో పనులు జరుగుతున్న కొద్దీ మరిన్ని సంస్థలు ముందుకు వస్తాయని వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, ఇతర ప్రముఖ కంపెనీలను అమరావతికి తెచ్చే అంశంపై కమిటీలో చర్చ జరిగిందని పేర్కొన్నారు.
ప్రజారాజధానికి మహర్దశ - భారీగా నిధులు - అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ