PAWAN: అధికారం ఉందని వైకాపా నేతలు ఇష్టం వచ్చినట్లు దౌర్జన్యాలు చేస్తున్నారని.. బలహీనులపై దాడులు పెరిగితే ఉద్యమాలు వస్తాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ హెచ్చరించారు. ప్రజలు మిమ్మల్ని ఉరుకులు, పరుగులు పెట్టిస్తారు.. జాగ్రత్త అని సూచించారు.
విజయవాడలో రెండోవిడత జనవాణి - జనసేన భరోసా కార్యక్రమాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రారంభించారు. ఎంబీకే భవన్‌లో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం మా వంతు కృషి చేస్తామని పవన్ భరోసా ఇచ్చారు. ప్రతి అర్జీని సంబంధిత శాఖల అధికారులకు పంపుతున్నామని.. సీఎం సంక్షేమనిధి, ఆరోగ్యశ్రీలో అమలుకాని అర్జీలు వచ్చాయని తెలిపారు. ప్రభుత్వం స్పందించి సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని కోరారు.
రేణిగుంట మండలం తారకరామనగర్ వాసి తన ఇల్లు లాక్కున్నారని తన బాధను పవన్‌కు తెలియజేశారు. దీనిపై స్పందించిన పవన్.. గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఇంటిని ఎంపీటీసీ లాక్కోవడం దారుణమన్నారు. లాక్కున్న ఇంటిని మళ్లీ మహిళకు అప్పగించాలని డిమాండ్ చేశారు.
పీఏసీ ఛైర్మన్: ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం వల్ల ఎందరో ఇబ్బంది పడుతున్నారని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. అర్జీల రూపంలో వచ్చిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్తామని.. సాధ్యమైనంత త్వరగా సమస్య పరిష్కారం అయ్యేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. గత ఆదివారం నిర్వహించిన జనవాణిలో 427 అర్జీలు వచ్చాయని.. వచ్చే ఆదివారం(17) నాడు భీమవరంలో జనవాణి కార్యక్రమం నిర్వహిస్తామని వెల్లడించారు.
ఇవీ చదవండి: