ఒక కేసు విచారణలో సలాం, అతని భార్యను పోలీస్ స్టేషన్కు పిలిచినందుకే ఈ ఆత్మహత్య చోటు చేసుకుందని పవన్ అన్నారు. విచారణ ఆ దిశలో సాగిందా? అనే వాస్తవాలు వెల్లడి కావాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. ఈ బాధాకర ఘటనకు కారణమైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కేసు విషయంలో ప్రభుత్వ చర్యలు నాటకీయంగా కనిపిస్తున్నాయని.. ఎక్కడా చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. నంద్యాలలో సలాం కుటుంబానికి జరిగిన అన్యాయమనే కాదు... ఇలాంటి ఘటనలు ఉత్పన్నం కావడానికి అసలు కారణం పోలీసులు.. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గడమేనని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. వ్యవస్థలో భాగమైన పోలీసులు తమకున్న నియమ నిబంధనలను, చట్టాన్ని అనుసరించే క్రమంలో పాలకుల జోక్యానికి తావిస్తే ఇలాంటి దురదృష్టకర పరిస్థితులే తలెత్తుతాయని వ్యాఖ్యానించారు.
సీతానగరంలో పోలీసులే ఒక ఎస్సీ యువకుడికి శిరోముండనం చేయించారని, విశాఖపట్నంలో డా. సుధాకర్ విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరు, రాజధాని రైతులకు బేడీలు వేయడం లాంటి ఘటనల్లో పోలీసుల వెనకు ఉండి నడిపిస్తున్న వారిపై ప్రజలంతా దృష్టి సారించాలన్నారు.
ఇదీ చదవండి: దుబ్బాక ఉప ఎన్నిక పోరు... భాజపా జయకేతనం