పండగలు వస్తున్నాయంటే.. తెలుగు రాష్ట్రాల్లో మూడు నెలలముందు నుంచే హడావుడి మొదలవుతుంది. తమ సొంతూళ్లలో పండుగను జరుపుకునేందుకు నగరవాసులు బయలుదేరుతారు. ముఖ్యంగా పండగల ముందు కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల మధ్య పెద్దఎత్తున రాకపోకలు సాగుతాయి. కానీ ఈ సారి పరిస్ధితి భిన్నంగా ఉంది. కరోనా కారణంగా.. రైళ్లు నడస్తాయో లేదోనని ముందస్తు రిజర్వేషన్ ప్రారంభించలేదు. ఇటీవలే హైదరాబాద్ నుంచి విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాలకు అతి కొద్దిరైళ్లు ఏర్పాటు చేశారు. ఆ రైళ్లలో రిజర్వేషన్ ప్రారంభమైన గంటల వ్యవధిలోనే బెర్తులన్నీ నిండిపోయాయి. సాధారణ రోజుల్లో హైదరాబాద్ నుంచి ఏపీకి రోజూ పదుల సంఖ్యలో రైళ్లు రాకపోకలు సాగిస్తుండేవి. ప్రస్తుతం కేవలం 3 లేదా 4 రైళ్లు మాత్రమే నడుపుతున్నారు. ఈ పరిస్థితుల్లో పెద్దఎత్తున రైళ్లు ఏర్పాటు చేసే అవకాశం లేదని భావించిన ప్రయాణికులు రైలు ప్రయాణంపై ఆశలు వదులుకున్నారు.
పండుగరోజుల్లో ఎక్కువ మంది ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణిస్తుంటారు. పండగకు టికెట్లు బుకింగ్ చేసుకుందామని.. రిజర్వేషన్ కేంద్రాలకు వెళితే బస్సు సర్వీసులు లేవనే సమాధానం వస్తోంది. దేశవ్యాప్తంగా అన్ లాక్ ప్రారంభమై నెలలు గడుస్తున్నా.. తెలుగు రాష్ట్రాల మధ్య బస్సుల రాకపోకలు ఇంకా ప్రారంభం కాలేదు. పలుమార్లు ఇరు రాష్ట్రాల ఎండీలు చర్చించినా ఫలితం లేకపోయింది. దీంతో ఇరురాష్ట్రాల మధ్య బస్సులు ఎప్పుడు ప్రారంభమవుతాయో తెలియని పరిస్ధితి ఉందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.
సాధారణంగా దూరప్రాంతాలకు నడిచే అంతర్రాష్ట్ర సర్వీసుల వల్లే ఏపీ ,తెలంగాణ రాష్ట్రాల ఆర్టీసీలకు భారీగా ఆదాయం సమకూరుతుంది. బస్సులు తిప్పకపోవడం వల్ల ఏపీఎస్ఆర్టీసీ రోజుకు 3 కోట్ల మేర నష్టపోతుండగా.. తెలంగాణ ఆర్టీసీ 2 కోట్ల వరకు నష్టపోతోంది. పండగ వేళ బస్సులు తిప్పకపోతే తెలుగు రాష్ట్రాల ఆర్టీసీలు మరింత ఆదాయం కోల్పోవడంతోపాటు.. ప్రయాణికుల ఆదరణ కోల్పోయే ప్రమాదం ఉందని కార్మిక సంఘాలు అంటున్నాయి. ఇదే జరిగితే ఆర్టీసీలకు మరింత నష్టం వస్తుందని కార్మిక నేతలు ఆందోళన చెందుతున్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సత్వరమే బస్సులు తిప్పేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
సర్కారు బస్సులు ఎప్పుడు తిరుగుతాయో చెప్పలేని పరిస్థితుల్లో.. డిమాండ్ ను ఆసరాగా చేసుకున్న కొందరు ప్రైవేట్ ట్రావెల్స్ యజమానులు రేట్లు పెంచి దోచుకుంటున్నారు. దీంతో సామాన్య ప్రజలు పండగ వేళ వారి ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి వీలైనంత త్వరగా ఎక్కువ సంఖ్యలో రైళ్లు, బస్సులు తిప్పేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: నేడు జగనన్న విద్యా కానుక పథకం ప్రారంభిచనున్న సీఎం