కరోనా రోగులకు త్వరలో ఆర్టీసీ బస్సుల్లో మొబైల్ ఆక్సిజన్ పడకలు అందుబాటులోకి రానున్నట్లు.. మంత్రి పేర్ని నాని తెలిపారు. కరోనా రోగులకు అందిస్తున్న వైద్యం, అందుబాటులో ఉన్న పడకలు, ఆక్సిజన్ సరఫరా తదితర అంశాలపై అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. కృష్ణా జిల్లా ప్రభుత్వాసుపత్రిలో 350 పడకలు, ఓ ప్రైవేటు కళాశాల ఆవరణలో 50, నోబుల్ కళాశాలలో 50, పోలీస్ కళ్యాణ మండపంలో ఫ్రంట్లైన్ వారియర్స్ కోసం 30 పడకలను అందుబాటులోకి తెచ్చామని మంత్రి తెలిపారు.
ఆక్సిజన్ కాన్సెంట్రేట్ మిషన్లు ఎంతో ఉపయోగం
ఆక్సిజన్ అందక రోగులు ఇబ్బందులు పడుతున్న కారణంగా.. ఇంచుమించు అన్ని పడకలకు ఆక్సిజన్ సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆక్సిజన్ సిలిండర్ల కంటే ఆక్సిజన్ కాన్సెంట్రేట్ మిషన్లు కరోనా రోగుల చికిత్సకు ఎంతో ఉపయోగకరమని అన్నారు. దాతలు ఎవరైనా నిమిషానికి 10 లీటర్లు ఉత్పత్తి సామర్థ్యం గల ఆక్సిజన్ కాన్సెంట్రేట్లు అందించాలని కోరారు. ఎవరైనా డాక్టర్ కోర్సు చదివి లేదా నర్సింగ్ కోర్స్ ఫైనలియర్ విద్యార్థులు ఉంటే.. ఇంటర్వ్యూ ద్వారా విధుల్లోకి తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే జిల్లాలో అన్ని పట్టణాలలో కొవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేశామని.., ఏజెన్సీ ఏరియాల్లో కరోనా రోగులకు వైద్య చికిత్స అందించడం కోసం.. ఆర్టీసీ స్లీపర్ ఏసీ బస్సుల్లో ఆక్సిజన్ పడకలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఒక్కో బస్సులో 10 ఆక్సిజన్ కాన్సెంట్రేట్ మిషన్లు ఏర్పాటుకు గ్రీన్ కో అధినేత చలమలశెట్టి అనిల్ ముందుకు వచ్చారని, వీటిని కూడా త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి తెలిపారు.
కృష్ణా జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. కొత్తగా వ్యాపిస్తున్న బ్లాక్ ఫంగస్, దాని వ్యాధి లక్షణాలపై అధికారుల నుంచి వివరాలు సేకరించారు.
ఇదీ చదవండి: