కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలపై విపక్షాలు కుట్రపూరితంగా అసత్య ప్రచారాలు చేస్తున్నాయని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్య నారాయణ రాజు విమర్శించారు. ఆదివారం విజయవాడలో రావెల కిశోర్ బాబుతో పాటు ఆయన మీడియాతో మాట్లాడారు. మార్కెట్ యార్డులు కొనసాగిస్తూనే రైతులు తమ సరకు ఎక్కడైనా అమ్ముకునే అవకాశం ఈ చట్టాల ద్వారా వచ్చిందని తెలిపారు. కాంగ్రెస్, వామపక్ష పార్టీలు మార్కెట్ యార్డ్లు మూతపడతాయని అబద్ధాలు చెబుతున్నాయని మండిపడ్డారు.
స్వామినాథన్ కమిటీని కాంగ్రెస్ ప్రభుత్వమే నియమించిందన్న సూర్య నారాయణ... 2014వరకు అధికారంలో ఉన్నా ఆ కమిషన్ సిఫార్సులను అమలు చేయలేదన్నారు. రైతుల ఇబ్బందులను మోదీ గుర్తించి.. స్వామినాథన్ కమిషన్ సూచనల ప్రకారం చట్టం తెచ్చారని ఆయన అన్నారు. మరోవైపు రైతుల కోసం చేసిన కొత్త చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పార్టీ తరఫున కార్యక్రమాలు నిర్వహిస్తామని భాజపా నాయకుడు రావెల కిశోర్ బాబు వెల్లడించారు.