Ongole Cattle in Akhanda Movie : ఇవే.. అఖండ సినిమాలో బాలయ్య పిలవగానే రంకెలేసిన పోట్ల గిత్తలు...! చూపులో పౌరుషం, నడకలో రాజసం, కొమ్ముల్లో వాడిని వెండితెరపై ప్రదర్శించిన ఒంగోలు జాతిఎద్దులు.! బాలకృష్ణ 'బసవా' అనగానే దుమ్మురేపుతూ ఫ్రేమ్‌లోకి ఒక్కసారిగా దూసుకొచ్చి థియేటర్లను హోరెత్తించాయి. సినిమాలో అంతలా కట్టిపడేసిన ఈ ఎద్దులు మన గుంటూరు జిల్లావే.!
ప్రత్యేక శిక్షణ...
అఖండ సినిమాలో ఆరంభ, ముగింపు సన్నివేశాలను ఈ గిత్తలు రక్తికట్టించాయి. బాలయ్య బసవా అని పిలవగానే కొమ్ములు విసురుతూ విలన్ల భరతం పట్టాయి. కథలో బసవన్నలు కీలకం కావటంతో దర్శకుడు బోయపాటి శ్రీను గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో అరా తీశారు. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లు బోయపాటి పక్కఊరైన కొప్పురావూరులోనే ఇవి కనిపించాయి. ఇక అంతే బోయపాటి అడగం, యజమాని సరే అనడం, సీన్లు చిత్రీకరించడం జరిగిపోయాయి. కాకపోతే వేగంగా పరిగెత్తడం, ఆగడంపై గిత్తలకు శిక్షణ ఇచ్చాకే కెమెరా ముందుకు తీసుకెళ్లారు.
బండలాగుడు పోటీలకూ సైతం...
Ongole Cattle in Akhanda Movie : శ్రీనివాసరావుకు చెందిన మొత్తం 4ఎద్దుల్ని అఖండ సినిమా చిత్రీకరణలో వినియోగించారు. వాటిలో ఒకదానిని అమ్మేయగా, మరొకటి అనారోగ్యంతో చనిపోయింది. సినిమా చూసివాళ్లు... గిత్తలను మెచ్చుకుంటున్నారని యజమాని మురిసిపోతున్నారు. 16 ఏళ్లుగా ఒంగోలు గిత్తలను పెంచుతున్న శ్రీనివాసరావు.. బండ లాగుడు పోటీలకు వాటిని తీసుకెళ్తుంటారు.
ఇవీచదవండి.