కృష్ణా జిల్లా వీరులపాడు మండలం చట్టన్నవరరం గ్రామంలో, 85 సంవత్సరాల పైబడిన గద్దల మరియమ్మ అనే వృద్ధురాలికి పింఛను నిలిపివేశారు. 15 సంవత్సరాల నుంచి వస్తున్న పింఛన్‌ను.. ఓకే కార్డులో, రెండు పింఛన్లు ఉన్నాయని నిలిపివేశారు. దీంతో వృద్ధురాలు ఆందోళన చెందుతూ తనకు ఆసరాగా ఉన్న పింఛన్‌ను పునరుద్ధరించాలని వేడుకుంటుంది. ప్రభుత్వం కూడా పెద్దమనసు చేసుకొని.. వృద్ధాప్యంలో ఉన్న తనలాంటి వారికి అన్యాయం చేయవద్దని కోరుతుంది.
తనకు ఆసరాగా ఉన్న జీవనభృతి కల్పిస్తున్న పింఛను నిలిపివేయడం న్యాయమేనా అని ప్రశ్నించింది.
195 మంది నృద్ధులకు పింఛన్ల నిలిపివేత
అనంతపురం జిల్లా పెనుకొండ మండలంలో 195 మంది పింఛన్లను ప్రభుత్వం నిలిపివేసింది. పెనుకొండ మండలంలోని 11 గ్రామ పంచాయతీలు, ఒక నగర పంచాయతీ పరిధిలో.. సెప్టెంబర్ నెలకు సంబంధించి 195 మంది వృద్ధులు, వితంతు పింఛన్లు నిలిపివేశారు. పింఛన్లు నిలిపివేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వృద్ధులు వాపోతున్నారు.
బయోమెట్రిక్ అప్డేట్ చేయించుకోవాలని నోటీసులు జారీ చేసినప్పటికీ.. కొందరు వృద్ధులకు వివిధ కారణాల వల్ల వేలిముద్రలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పెనుకొండ నగర పంచాయతీ పరిధిలోని ఇస్లాపురం గ్రామానికి చెందిన గంగప్ప అనే వృద్ధుడికి.. అర చేతులు, కాళ్లపై గాయాలయ్యాయి. ఆధార్ నమోదు కేంద్రానికి వెళితే వేలిముద్రలు పడటం లేదని తిరిగి పంపించేస్తున్నారని ఆవేదన చెందాడు. సంబంధిత అధికారులు స్పందించి.. తగిన పరిష్కారం చూపాలని కోరారు.
మండలంలో నిలిపివేసిన పింఛన్లను తొలగించినట్లు కాదని ఎంపీడీవో శివశంకరప్ప అన్నారు. నోటీసులో సూచించిన విధంగా బయోమెట్రిక్ అప్డేట్ చేయించుకుని సచివాలయంలో అందజేస్తే పింఛను పునరుద్ధరిస్తారని ఆయన తెలిపారు.
ఇదీ చదవండి: తాడిపత్రిలో వైకాపా నాయకుడి హత్య