traffic issue: విజయవాడ బెంజ్ సర్కిల్‌లో ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు రెండు బ్రిడ్జిలు నిర్మించినా సమస్య ఇంకా పూర్తిగా పరిష్కారం కాలేదు. వంతెనలు నిర్మించిన తర్వాత గతంలో ఇక్కడున్న సిగ్నళ్లను తొలగించారు. ఆ తర్వాత సిగ్నల్ వ్యవస్థ పునరుద్ధరణకు నోచుకోలేదు. దీనివల్ల నిత్యం రద్దీగా ఉండే ఈ కూడలిలో ట్రాఫిక్ సమన్వయానికి పోలీసులు నానా అవస్థలు పడాల్సి వస్తోంది. అలాగే వాహనదారులు సైతం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.
ఒక్క వరుసలోనే వాహనాలను వదులుతుండడంతో కూడలి దాటడానికి బాగా ఆలస్యమవుతోంది. రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో వాహనదారుల సహనానికి పరీక్ష పెట్టినట్లవుతోంది. ఈ పరిస్థితుల్లో సిగ్నల్స్ వ్యవస్థను పునరుద్ధరిస్తే కొంత ఊరట లభించే అవకాశం ఉంది.
బెంజి సర్కిల్‌లో కొత్త హంగులతో సిగ్నల్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని పోలీసులు భావిస్తున్నారు. అందుకోసం రూ.15 లక్షల నుంచి 20 లక్షల వ్యయమవుతుందని అంచనా వేస్తున్నారు. అలాగే కూడలిని ఆదర్శంగా తీర్చిదిద్దాలని అనుకుంటున్నారు. కూడలికి నాలుగు వైపులా ఎల్ఈడీ తెరలు ఏర్పాటుచేసి వాటిపై వివిధ మార్గాల సూచికలు, వాహనదారులకు సూచనలు, వాతావరణ సమాచారం అందుబాటులో ఉంచాలని నిశ్చయించారు.
అయితే ఈ నమూనాకు ఇంకా ఉన్నతస్థాయిలో ఆమోదం లభించలేదు. అప్పట్లో నమూనా ఖరారుపై పూర్వ డీజీపీ సవాంగ్‌తో ఓసారి సమావేశం జరిగింది. ఆయన పలు సూచనలు చేశారు. ఆ మేరకు కొన్ని మార్పులు చేర్పులు చేశారు. ఇంతలో ఆయన స్థానంలో కొత్త డీజీపీ రావడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది.
నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఇప్పటికే రూ.55 లక్షలు వెచ్చించి 16 చోట్ల కొత్తగా సిగ్నళ్లు ఏర్పాటు చేశారు. ఇవి కాకుండా మరో 9 ప్రాంతాల్లో సిగ్నళ్లు అవసరమని గుర్తించారు. జమ్మిచెట్టు సెంటర్, చుట్టుగుంట, పుష్ప హోటల్, నైస్ బార్, పైపుల రోడ్డు, విద్యాధరపురం, స్వాతి, వెంకటేశ్వర ఫౌండ్రి ప్రాంతాల్లో తర్వాతి దశలో బిగించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.
ఇదీ చదవండి: ఉక్రెయిన్‌లోని భారతీయులకు కేంద్రం కీలక సూచనలు