కొవిడ్ దృష్ట్యా విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల దర్శనాలపై అధికారులు పరిమితి విధించారు. నవరాత్రుల్లో ప్రతిరోజూ పది వేల మందికి మాత్రమే దర్శనం కల్పించాలని అధికారులు నిర్ణయించారు. భక్తులకు ఆన్లైన్ ద్వారా టికెట్ల జారీ ప్రక్రియ చేపట్టారు. దర్శనానికి వచ్చే భక్తులు ముందుగా దుర్గా మల్లేశ్వర స్వామి వారి వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా టికెట్లు తీసుకుని రావాలని స్పష్టం చేశారు. ఈనెల 17 నుంచి 25వ తేదీ వరకు అన్ని రోజులకూ దర్శన టికెట్లు ఆన్ లైన్ లో ఉంచారు. టికెట్లు పొందేందుకు భక్తులు విపరీతంగా పోటీ పడ్డారు. ఫలితంగా ఆన్లైన్లో కేటాయించిన టికెట్లన్నీ గంటల వ్యవధిలోనే పూర్తయ్యాయి. ఈ నెల 25న దసరా పండుగ వరకూ ప్రతి రోజూ అన్ని సేవల టికెట్లు జారీ పూర్తైంది. ప్రస్తుతం ఆన్లైన్ ద్వారా ఒక్క టికెట్ కూడా లభించని పరిస్ధితి నెలకొంది. ప్రస్తుతం ఆర్జిత సేవలు, 100 రూపాయలు, 300 రూపాయలు టికెట్లు సహా ఉచిత దర్శనం టికెట్లు ఏవీ అందుబాటులో లేవని వెబ్సైట్లో కనిపిస్తోంది.
నవరాత్రుల్లో అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తుంటారు. స్థోమత ఉన్నవారు రూ.100 లేదా 300 టికెట్లు తీసుకుని కుటుంబమంతా దర్శనం చేసుకుంటారు. కుటుంబ సభ్యులందరికీ డబ్బు చెల్లించి టికెట్ తీసుకోలేని పేదలు ఉచిత దర్శనం చేసుకుంటారు. ఇంద్రకీలాద్రికి చేరుకున్నాక క్యూలైన్ వద్ద అప్పటికప్పుడు ఉచిత దర్శనం టికెట్ తీసుకుని క్యూలైన్లలో వెళ్లి దర్శనం చేసుకునే వారు. ఈసారి అమ్మవారి ఉచిత దర్శనం టికెట్లన్నీ ఆన్లైన్లోనే జారీ చేశారు. దీంతో నిరక్ష్యరాస్యులైన పలువురు భక్తులు వీటిపై అవగాహన లేక టికెట్లు తీసుకోలేదు. తీరా ఇక్కడికి వచ్చాక తీసుకుందామంటే టికెట్లన్నీ ఎప్పుడో పూర్తైపోయాయని చెబుతున్నారు. రూ.100 లేదా 300 రూపాయల టికెట్లు మాత్రమే అప్పటికప్పుడు అదనంగా జారీ చేస్తున్నారు. ఉచిత దర్శన టికెట్లు ఇవ్వకపోవడంతో డబ్బు చెల్లించి దర్శనానికి వెళ్లాల్సి వస్తోంది. ఉచిత దర్శనానికి కూడా అప్పటికప్పుడు టికెట్లు జారీ చేయాలని భక్తులు కోరుతున్నారు.
ఆన్ లైన్ లో టికెట్లు బుకింగ్ చేసుకుని వివిధ కారణాలతో దర్శనానికి రాని వారి స్థానంలోనైనా తమకు అప్పటికప్పుడు ఉచిత దర్శనం టికెట్లు ఇవ్వాలని పేద భక్తులు కోరుతున్నారు. రద్దీ తక్కువగా ఉన్న సమయాల్లోనైనా తమకు అమ్మవారిని దర్శించుకునే అవకాశం కల్పించాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: నవంబరు 2 నుంచి పాఠశాలలు పునః ప్రారంభం