New vehicles registration with OTP: కొత్త వాహనం కొనుగోలు చేస్తే.. ఇప్పటినుంచి మీ ఆధార్‌కు అనుసంధానం చేసిన ఫోన్ నంబరు తప్పనిసరిగా ఉండాల్సిందే. ఆ నంబరుకు వచ్చే వన్ టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ) నమోదు చేస్తేనే వాహన రిజిస్ట్రేషన్ జరుగుతుంది. గతంలో మాదిరిగా వేలి ముద్రతో రిజిస్ట్రేషన్ జరుగుతుందనుకుంటే.. అది సాధ్యం కాదు. ఈ మేరకు రాష్ట్ర రవాణాశాఖ.. కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ (మోర్త్) నిర్వహించే వాహన్ పోర్టల్ ద్వారా వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను చేపట్టింది.
ఇప్పటి వరకు ఏపీ ఈ ప్రగతి పోర్టల్ ద్వారా రవాణాశాఖ సేవలు లభించేవి. దీనికి ఓటీఎస్‌ఐ అనే సంస్థ ఇంతకాలం సాంకేతిక సహకారం అందిస్తోంది. అనేక రాష్ట్రాలు రవాణాశాఖలకు చెందిన సేవలన్నింటినీ వాహన్, సారథి పోర్టల్ ద్వారానే అందిస్తున్నాయి. రాష్ట్రంతోపాటు, తెలంగాణ, మధ్యప్రదేశ్ మాత్రమే సొంత పోర్టళ్లు నిర్వహిస్తున్నాయి. కొద్ది నెలల కింద ఏపీ రవాణాశాఖ కూడా వాహన్, సారథి సేవలు పొందేలా నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా గత వారం నుంచి వాహన్ పోర్టల్ ద్వారానే కొత్త వాహనాల తాత్కాలిక రిజిస్ట్రేషన్, పూర్తిస్థాయి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆరంభించారు.
గతంలో ఆధార్‌కు ఫోన్ నంబరు అనుసంధానం లేకపోతే, వేలి ముద్ర తీసుకొని రిజిస్ట్రేషన్ చేసేందుకు వీలుండేది. వాహన్‌లో ఈ అవకాశం లేదు. రాష్ట్రంలో కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు అన్నీ వాహన్ పోర్టల్ ద్వారానే జరుగుతాయని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే డ్రైవింగ్ లైసెన్సులు, ఎల్‌ఎల్‌ఆర్‌లు సారథి పోర్టల్ ద్వారానే జారీ చేస్తున్నారు. రవాణాశాఖ దాదాపు 40కిపైగా ఆన్‌లైన్ సేవలు అందిస్తుండగా.. రెండు నెలల్లో అవన్నీ వాహన్ ద్వారానే లభించనున్నాయి.
ఈ మేరకు సమాచారం అంతటినీ అప్‌లోడ్ చేస్తున్నారు. వాస్తవానికి గత డిసెంబరుకే పూర్తి చేసి ఈ ఏడాది ఆరంభం నుంచి వాహన్ ద్వారానే సేవలు అందించాలని నిర్ణయించినప్పటికీ సాధ్యం కాలేదు. ఇప్పుడు రవాణాశాఖ కొత్త కమిషనర్ కాటంనేని భాస్కర్ దీనిపై దృష్టి సారించి జులై చివరి నాటికి పూర్తి చేయాలని అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించారు.