మంగళవారం దిల్లీలోని రాష్ట్రపతిభవన్‌లో ప్రతిష్ఠాత్మకమైన ‘నారీశక్తి’ పురస్కారాలు అందించారు. విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ ప్రసన్నశ్రీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. అల్పసంఖ్యాక గిరిజన భాషల సంరక్షణకు కృషిచేస్తూ.. వాటికి లిఖిత రూపాలను అభివృద్ధి చేసినందుకు గాను ఆమెకు ఈ పురస్కారం లభించింది.
"నేను 20 సంవత్సరాలకు పైగా చేసిన అవిరళ కృషి ఫలితంగా ఇప్పటి వరకు 19భాషలకు లిపి ఆవిష్కరించగలిగా. బ్రిటన్లోని ‘వరల్డ్ లాంగ్వేజ్ రైటింగ్ సిస్టమ్స్’ అనే సంస్థ వాటిని గుర్తించింది. భగత, గదబ, ధ్రువ, గోండి, కోయ, గౌడ్, జాతాపు, కమ్మర, కొలామి, కొండదొర, కొటియా, కుపియా (వాల్మీకి), మాలి, మూకదొర, పోర్జ, రణ, సవర, సుగాలీ, ఎరుకల జాతులకు నేను ఆవిష్కరించిన భాషలు అత్యంత ఉపయుక్తంగా ఉంటాయి" -ఆచార్య సత్తుపాటి ప్రసన్నశ్రీ
భాషాశాస్త్రవేత్తగా..
నేను ఆంగ్ల విభాగ ఆచార్యురాలిగా విధులు నిర్వర్తిస్తూనే లిపిల ఆవిష్కరణపై దృష్టి సారించాను. ఆచార్యురాలిగా 106 పరిశోధన పత్రాలు సమర్పించడంతోపాటు 32 పుస్తకాలు కూడా రచించాను. పలు కవితలు కూడా రాశాను. అమెరికాలోని ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న ‘ఆఫ్రో ఏసియాటిక్ స్టడీ సెంటర్’కు విజిటింగ్ ఆచార్యురాలిగా ఉన్నా. 15 అంతర్జాతీయ స్థాయి అవార్డులు అందుకున్నా. అత్యధిక గిరిజన భాషలకు లిపి కనుగొన్నందుకుగానూ ‘లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్’, ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో కూడా పేరు నమోదైంది. అలా భాషా శాస్త్రవేత్తగా గుర్తింపు పొందాను.
మాతృభాషలో బోధన..
సంబంధంలేని భాషలో చదువుకోవాల్సి రావడంతో నేటికీ పలు గిరిజన తెగల్లో అక్షరాస్యత శాతం చాలా తక్కువగా ఉంది. కొత్త లిపులు వారికి చేరువైతే మంచి ఫలితాలొస్తాయి. మాతృభాషలో కొంతవరకు చదవగలిగితే...క్రమంగా ఇతర భాషలకు కూడా వారు చేరువవుతారు.
ఏయూ నుంచే ప్రస్థానం..
ఏయూలో ఎం.ఎ.(ఇంగ్లిషు) చదివా. 1987లో తిరుపతిలోని పద్మావతి మహిళావిశ్వవిద్యాలయంలో అధ్యాపక వృత్తి చేపట్టాను. 1991లో పరిశోధనలు మొదలుపెట్టాను. గిరిజనులపై అధ్యయనానికి తిరుపతి నుంచి అరకు వెళ్లేదాన్ని. 2000లో ఏయూ ఆంగ్ల విభాగంలో అసోసియేట్ ఆచార్యురాలిగా ఎంపిక కావడంతో గిరిజనులతో మమేకమయ్యే అవకాశం దక్కింది.
కలత చెంది..
నా స్వస్థలం గుంటూరు జిల్లా. గిరిజనులైన మా పూర్వికులు తాతల కాలంలోనే మైదాన ప్రాంతాలకు వలస వచ్చేశారు. గిరిజనురాలినైనప్పటికీ ఒక్క గిరిజన భాష కూడా నాకు రాదు. తాత, నానమ్మలు ఇంట్లో గిరిజనభాషలో మాట్లాడేవారు. నేనూ స్వల్పంగా మాట్లాడుతుండేదాన్ని. పెద్దయ్యే కొద్దీ గిరిజన భాషలపై మమకారం పెరిగింది. అడవుల్లో గిరిజనులు పరిస్థితులు..వారు ఎదుర్కొంటున్న అన్యాయాలు, అక్రమాలు తెలుసుకుని తీవ్రంగా కలత చెందాను. వారి బాధలు తీర్చాలన్న ఆలోచనే నన్ను లిపిలపై పరిశోధనలకు పురికొల్పింది.
అంత సులభం కాదు..
లిపి ఆవిష్కరణ సులభంగా జరగలేదు. గిరిజనులు ఉచ్ఛరిస్తున్న అన్ని పదాలకు అక్షరాలు ఉండాలి. వారి భాషపై అధ్యయనం చేయడానికే చాలా రోజులు పట్టింది. గిరిజనుల్లో ఎన్నో తెగలున్నాయి. ఆయా తెగల వారు కూడా పలు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో విస్తరించి ఉన్నారు. ఒకే గిరిజన తెగలో కూడా ఒక ప్రాంతానికి మరో ప్రాంతానికి ఉచ్ఛారణ, పదాలు కూడా మారిపోతాయి. ఈ నేపథ్యంలో గిరిజన తెగల వారీగా అక్షరాలు కనిపెట్టాలని నిర్ణయించా. ఆ అక్షరాలు కూడా ఆయా తెగల సంస్కృతి, సంప్రదాయాలు, వారి వాడే ఉపకరణాలు, కొలిచే దేవుళ్లు, వస్త్రధారణ, కట్టుబాట్లు, అలవాట్లు ప్రతిఫలించేలా ఉంటే గుర్తుంచుకుంటారని భావించాను. ఇందుకు పలు రాష్ట్రాల్లోని గిరిజన తండాలకు వెళ్లి వారితో మమేకమయ్యా.
- చాలా తెగల వారు ఇతరులను నమ్మేవారుకాదు. నేను గిరిజనురాలినని చెప్పినా విశ్వసించలేదు. అందుకే పలు గిరిజన భాషలు నేర్చుకోవాల్సి వచ్చింది. వారి మాటలను గంటలపాటు రికార్డు చేసుకుని.. వివిధ పదాలను ఉచ్ఛరిస్తున్న తీరును తెలుసుకున్నా. ఆయా తెగల్లో కొంచె చదువుకున్న వారి సాయం తీసుకుని, నేను కొంత వారి భాష మాట్లాడుతూ ఆచార వ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాలను తెలుసుకుని.. వారి జీవన విధానాన్ని అధ్యయనం చేసి అక్షరాలను ఆవిష్కరించాను.
ఇదీ చదవండి:
Postal Stamp: ప్రముఖ గాయని పి. సుశీల పేరిట తపాలా స్టాంపు విడుదల