కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో కాళ్లు మొక్కుతామని పేదలు వేడుకున్నా వైకాపా ప్రభుత్వం కనికరించలేదని నారా లోకేశ్ మండిపడ్డారు. గతంలో తెదేపా ప్రభుత్వం హయంలో 964 మంది పేదలకు ఇచ్చిన 50 ఎకరాల భూమిని.. ఇప్పుడు జగన్ రెడ్డి దౌర్జన్యంగా లాక్కుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్ల స్థలాల పంపిణీ పేరుతో వైకాపా చేస్తున్న అక్రమాలు అన్నీ.. ఇన్నీ కావని మండిపడ్డారు.
- ఎమ్మిగనూరులో ఏం జరిగిందంటే..
ఎమ్మిగనూరు శివన్ననగర్‌లో పేదలు వేసుకున్న దాదాపు 100 గుడిసెలను పట్టణ సీఐ ప్రభాకర్‌రెడ్డి, తాలుకా సీఐ మహేశ్వరరెడ్డి, పురపాలక కమిషనర్ రఘునాథ్‌రెడ్డి సమక్షంలో మంగళవారం తొలగించారు. కొందరు లబ్ధిదారులు సీఐ కాళ్లు పట్టుకొని ‘మా స్థలాలు మాకు ఇప్పించండి’ అని వేడుకున్నారు. ఆందోళన చేస్తున్న పట్టాదారులను పోలీసులు బలవంతంగా మినీ లారీలో పోలీసుస్టేషన్‌కు తరలించారు. తెదేపా హయాంలో 1999లో మాజీ మంత్రి బీవీ మోహన్‌రెడ్డి సమక్షంలో 50 ఎకరాల్లో 964 పట్టాలను వీరికి పంపిణీ చేశారు. ఈ స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలు చేపట్టకపోవడంతో పట్టాలను అధికారులు రద్దు చేసినట్లు తహసీల్దార్ వెంకటేశ్వర్లు ప్రకటించారు.
ఇదీ చదవండి: ఎంపీ రఘురామకృష్ణరాజుకు.. వైకాపా షోకాజ్ నోటీసు