"జగన్‌కు ఓట్లు వేయడమే గిరిజనులు చేసిన పాపమా?" అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిలదీశారు. అడ్డగోలు నిబంధనలతో ఆదివాసీలకు సంక్షేమపథకాలు అందకుండా దూరం చేయడం సీఎం జగన్‌కు న్యాయమా అని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి జగన్‌కు లోకేశ్ లేఖ రాశారు. ఆపేసిన పెన్షన్, రేషన్, సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలని లోకేష్ డిమాండ్ చేశారు. సంక్షేమపథకాలకు కోత వేయాలనే ఆలోచనతో.. కనీస అధ్యయనం లేకుండా ప్రభుత్వం తెచ్చిన నిబంధనలు వేలాదిమంది గిరిజనులకు పింఛను, రేషన్ రాకుండా చేస్తున్నాయని ఆరోపించారు. నిరక్షరాస్యులైన ఆ గిరిజనులు తమకు రేషన్ బియ్యం ఎందుకివ్వడంలేదో, పింఛను ఎందుకు ఆపేశారో తెలియక.. కొండలపై నుంచి దిగి రాలేక.. ఆకలితో, ఆవేదనతో కుంగిపోతున్నారని లోకేశ్ ఆవేదన వ్యక్తంచేశారు.
గిరిజనుల కష్టాలపై పత్రికలలో కథనాలు వచ్చినా సరిదిద్దే చర్యలు తీసుకోకపోవడం.. ఆదివాసీల పట్ల జగన్ కు ఉన్న చిన్నచూపును ఎత్తిచూపుతోందన్నారు. సంక్షేమ పథకాల్లో కోతవేయాలనే అజెండాతోనే పది ఎకరాల భూమి, ప్రభుత్వ ఉద్యోగం, వాహనం ఉన్నవారు సంక్షేమపథకాలకు అనర్హులని జగన్ ప్రభుత్వం జీవోలు తెచ్చిందన్నారు.
ఈ నిబంధనలు ఆదివాసీలను సంక్షేమ పథకాలకు దూరం చేస్తున్నాయన్నారు. ఏజెన్సీలో ఆదివాసీలకు భూమి పది ఎకరాలకు మించి ఉన్నా.. 1 నుంచి 3 ఎకరాలు మాత్రమే సాగులో ఉంటుందన్న లోకేశ్.. దీని ద్వారా సంవత్సరానికి గరిష్ఠంగా వచ్చే ఆదాయం 25వేల రూపాయలకు మించదని తెలిపారు. ఈ భూమి ఉందని వైకాపా ప్రభుత్వం పింఛను, రేషన్ తీసేయడం అన్యాయం కాదా? అని మండిపడ్డారు.
ఇటువంటి పరిస్థితుల్లో పది ఎకరాల నిబంధనతో గిరిజనుల నోటికాడ కూడు లాక్కోవడం, సంక్షేమపథకాలకు దూరం చేయడం ఎంతవరకు సమంజసమో ప్రభుత్వం పునఃపరిశీలించాలని ఆయన డిమాండ్ చేశారు. కొంతమంది ఆదివాసీలకు ఎటువంటి భూమి లేకపోయినా, రికార్డుల్లో 10 ఎకరాలు మించి ఉన్నట్టు చూపిస్తూ... సంక్షేమపథకాలు నిలిపేస్తున్నారన్నారు. రికార్డుల్లో ప్రభుత్వం చూపించిన భూమి ఆయా ఆదివాసీలకు అప్పగించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టంచేశారు. కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగం చేసినా ఆ కుటుంబపెద్దల ఆర్థికస్థితి కూడా చూడకుండా పెన్షన్లు ఆపేస్తున్నారని విమర్శించారు.
ఉద్యోగం వచ్చిన వ్యక్తి తల్లిదండ్రుల్ని కొండలపైనే వదిలి మైదానప్రాంతాలకి వెళ్లిపోతున్నారన్నారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం అనే కారణంతో సంక్షేమపథకాలు ఆపేస్తున్నారని, కొండలపై ఆ నిరుపేద వృద్ధులు ఎలా బతకాలో ప్రభుత్వం సమాధానం చెప్పాలని లోకేశ్ డిమాండ్‌చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీలు ఎదుర్కొంటున్న ఈ సమస్యలు తక్షణమే పరిష్కరించాలన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీలకు సంక్షేమ పథకాల అర్హత నిబంధనలను సవరించి కొత్త జీవోలు ఇవ్వాలన్నారు. వితంతులకు, దివ్యాంగులైన ఆదివాసీలకు నిలిపేసిన పింఛన్లు పునరుద్ధరించాలని లోకేశ్ డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: SMUGGLING: అక్రమంగా ఎర్రచందనం రవాణా.. ఐదుగురు స్మగ్లర్ల అరెస్ట్