రాష్ట్రంలోని రాజ్యాంగ వైఫల్యాలను ఎత్తిచూపుతూ...రాష్ట్రపతికి లేఖ రాయనున్నట్లు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వెల్లడించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థలను నిర్లక్ష్యం చేయడం తగదని.., తద్వారా రాజ్యాంగ సంక్షోభానికి దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ఉన్నంత వరకు ఎన్నికలు జరపకూడదన్న ధోరణి సరైనది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఎన్నికల కమిషనర్ సమీక్షకు పిలిస్తే అధికారులు సహకరించకపోవటం సరికాదని.., అభ్యంతరాలు ఏవైనా ఉంటే సమీక్షలో వెల్లడించాల్సి ఉందని స్పష్టం చేశారు. రాజ్యాంగాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్న ఆయన... స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి ఎందుకు తమ పార్టీ భయపడుతుందో తెలియటం లేదన్నారు. ఎలాంటి గుర్తులు లేని పంచాయతీ ఎన్నికలు నిర్వహించటంలో ఉన్న ఇబ్బందులేమిటని ఆయన ప్రశ్నించారు.
రాష్ట్రానికి వరప్రదాయని అయిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పట్ల నిర్లక్ష్యం తగదని రఘురామ వ్యాఖ్యానించారు. ఎక్కడైనా అవినీతి జరిగిందని తెలిస్తే...విచారణ జరిపించి రికవరీ చెయ్యాలన్నారు. గతాన్ని మరచిపోయి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్...పోలవరాన్ని పూర్తి చేసేందుకు చొరవ చూపాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టు...ఉత్తరాంధ్రకే కాకుండా...రాయలసీమకూ ప్రయోజనకారి అని అన్నారు. ఇంత అద్భుతమైన ప్రాజెక్టుకు నిధులు సమకూర్చుకోవటం పెద్ద కష్టమేమీ కాదని పేర్కొన్నారు. ఉచిత పథకాల అమలుతోపాటు...మౌలిక వసతులు అభివృద్ధి చేసి...రాబడి మార్గాలను పెంచుకోవాలన్నారు. క్రిస్మస్ కానుకగా ఇళ్ల స్థలాలను ఇవ్వటం సరికాదన్న ఆయన...పోలవరంపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. క్రిస్మస్ రోజున ఇళ్ల స్థలాలు ఇవ్వటం వల్ల ఒక మతానికి ప్రచారం కల్పించినట్లు అవుతుందన్నారు. కులాల విషయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సంయమనం పాటించాలని సూచించారు.
ఇదీచదవండి
స్థానిక ఎన్నికలకు మరోసారి నోటిఫికేషన్ ఇవ్వాలి: సోము వీర్రాజు