MONKEY ATTACKED ON OLD WOMEN: కోతుల గుంపులు పల్లెలు, పట్టణాలపై విరుచుకుపడుతున్నాయి. వ్యవసాయ క్షేత్రాల్లో చెట్లు నరికేయడంతో కోతులకు ఆవాసం లేకుండా పోతోంది. ఆహారం సైతం సమస్యగా మారింది. అంతేకాకుండా వాటి సంఖ్య ఏటికేడు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతోంది. గ్రామాల పరిధి దాటి పట్టణాలపై దాడి చేస్తున్నాయి. తాజాగా తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో కోతులు వీరంగం సృష్టించాయి.
ఇటీవల సుల్తానాబాద్‌లో మర్కటాల బెడద తీవ్రంగా ఉంది. ఈరోజు సాయంత్రం సుల్తానాబాద్‌లోని ట్యాంకు రోడ్డులో ఓ ఇంట్లోకి చొరబడ్డాయి. వీటిని గ్రహించిన ఇంటి యజమానురాలు మల్లమ్మ వాటిని తరిమేందుకు బయటకు వచ్చింది. దీంతో ఒక్కసారిగా ఆ వానరాల గుంపు మల్లమ్మపై విచక్షణరహితంగా దాడికి పాల్పడ్డాయి. దీంతో వృద్ధురాలు అక్కడే పడిపోయింది.
ఇందుకు సంబంధించిన ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో నిక్షిప్తం అయ్యాయి. ఈ ఘటనలో గాయపడ్డ బాధితురాలిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కోతుల బెడద నుంచి విముక్తి కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.