ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం రోజురోజుకు పెరుగుతోందని విద్యా శాఖ మంత్రి అదిములపు సురేశ్ ప్రకటించారు. ఈనెల 2 నుంచి 6 వరకూ క్రమేణా విద్యార్థుల హాజరు శాతం పెరిగిందని వెల్లడించారు. 10వ తరగతి విద్యార్థులు పాఠశాలకు వెళ్లేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని స్పష్టం చేశారు. శుక్రవారం 10వ తరగతి విద్యార్థులు 49.63 శాతం మంది హాజరయ్యారని.. 9వ తరగతి విద్యార్థులు 38.29 శాతం హాజరైనట్లు తెలిపారు. ఉపాధ్యాయులు 89.86 శాతం మంది విధులకు హాజరయ్యారని మంత్రి పేర్కొన్నారు.
గత నాలుగు రోజుల నుంచి 2వ తేదీన 42 శాతం విద్యార్థులు, 3న 33.69 శాతం విద్యార్థులు హాజరైతే 4వ తేదీన 40.30 శాతం, 5వ తేదీ 35 శాతం విద్యార్థులు పాఠశాలకు హాజరయ్యాన్నారు. 6న హాజరు శాతం 43.89కి చేరిందని తెలిపారు. కొన్ని జిల్లాల్లో కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయని వారిని హోమ్ ఐసొలేషన్ లో ఉంచి వైద్య సదుపాయాలు కల్పిస్తున్నామని స్పష్టం చేశారు. కొవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ పాఠశాలల్లో తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం