Minister Perni On RRR Movie: 'ప్రజల మీద భారం వేయకుండా అదే సమయంలో సినీ పరిశ్రమకు ఇబ్బంది లేకుండా టికెట్ల అదనపు ధరల విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని తెలిపారు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా టికెట్ల ధరల పెంపు విషయమై ఆ చిత్ర దర్శకుడు రాజమౌళి నుంచి తమ ప్రభుత్వానికి దరఖాస్తు అందిందని పేర్కొన్నారు. వెలగపూడి సచివాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘జీఎస్టీ, హీరో, హీరోయిన్, డైరెక్టర్ పారితోషికాలు కాకుండానే ఆర్‌ఆర్‌ఆర్ చిత్ర నిర్మాణానికి రూ.336 కోట్ల ఖర్చయిందని రాజమౌళి దరఖాస్తులో పేర్కొన్నారు’ అని తెలిపారు. ‘రాష్ట్రంలో సినిమా షూటింగులను పెంచేలా ప్రోత్సహిస్తున్నాం. అనుమతులను సింగిల్ విండో విధానంలో ఉచితంగా ఇస్తున్నాం. తెలంగాణ, ఉత్తరాది రాష్ట్రాల్లో దీనికి రుసుములు వసూలు చేస్తున్నారు’ అని పేర్ని నాని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల విక్రయాలకు సంబంధించిన మొత్తం ప్రక్రియను ఏప్రిల్, మే నాటికి పూర్తి చేయనున్నట్లు తెలిపారు. ‘ప్రతి రోజూ థియేటర్లలో ఉదయం 6 నుంచి రాత్రి 12 గంటల మధ్య 5 షోలను ప్రదర్శించవచ్చు. ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా నగదును మర్నాడు థిÅయేటరు యాజమాన్యాలకు అందిస్తాం. రూ.20 కోట్ల లోపు బడ్జెట్ ఉన్న చిన్న సినిమాలు విడుదలైనప్పుడు 5 షోల్లో ఒక షో దానికి కేటాయించాలి’ అని మంత్రి వివరించారు.
ఆర్‌ఆర్‌ఆర్ టికెట్ల ధరల పెంపునకు అనుమతి
జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ నటించిన ఆర్‌ఆర్‌ఆర్ చిత్రానికి టికెట్ ధరలను పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. రాష్ట్రంలోని అన్ని థియేటర్లలోనూ ప్రస్తుతమున్న ధరలపై రూ.75 పెంచుకునేందుకు అవకాశం కల్పించింది. సినిమా విడుదల తేదీ నాటి నుంచి 10 రోజుల పాటు టికెట్ల ధరలను పెంచుకోవచ్చని పేర్కొంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ నుంచి వచ్చిన వినతి మేరకు టికెట్ల ధర పెంచుకోవటానికి అనుమతిస్తున్నామని పేర్కొంటూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ గురువారం ఉత్తర్వులిచ్చారు.
సీఎం జగన్‌తో రాజమౌళి భేటీ..
ముఖ్యమంత్రి జగన్‌తో సినీ దర్శకుడు రాజమౌళి, నిర్మాత దానయ్య ఇటీవల భేటీ అయ్యారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన రాజమౌళి.. సీఎం చాలా బాగా రిసీవ్ చేసుకున్నారన్నారు. 'ఆర్ఆర్ఆర్' భారీ బడ్జెట్‌తో రూపొందించిన సినిమా కనుక.. సినిమాకు ఏం చేయాలో అది చేస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చినట్లు రాజమౌళి స్పష్టం చేశారు.
మార్చి 25న ప్రేక్షకుల ముందుకు..
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్'..మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులముందుకు రానుంది. రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా నటించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. అజయ్ దేవ్‌గణ్, సముద్రఖని, శ్రియ తదితరులు కీలకపాత్రలు పోషించారు. కీరవాణి సంగీతమందించారు. డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరించారు.
ఇదీ చదవండి
RRR: 'ఆర్ఆర్ఆర్' విషయంలో సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు: రాజమౌళి