వైఎస్సార్ చేయూత పథకాల ద్వారా మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు వివిధ ప్రైవేటు సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ సెర్ప్ -ప్రైవేటు సంస్థల మధ్య మొత్తం 14 సంస్థలతో వ్యాపార ఒప్పందాలు కుదిరాయి. మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స, కన్నబాబు, అప్పలరాజులతో కూడిన కమిటీ సమక్షంలో ఈ ఒప్పందాలు జరిగాయి. చేయూత పథకం ద్వారా మహిళలకు ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని.. మరో 6 లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని మంత్రులు వెల్లడించారు.
గతేడాది 3 లక్షల కుటుంబాలకు చేయూత ద్వారా ఉపాధి కల్పించామన్నారు. ఈ ఏడాది చేయూత, ఆసరా పథకాల ద్వారా 11 వేల కోట్లను ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. వైఎస్సార్ చేయూత ద్వారా గతేడాది అమూల్‌తో ఒప్పందం చేసుకుని మహిళల ఆర్థిక స్వావలంబనకు కృషి చేసినట్లు మత్స్య, పశుగణాభివృద్ధి శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. ఈ ఏడాదిలో పౌల్ట్రీ, బ్యాక్ యార్డ్ పౌల్ట్రీ, మినీ పౌల్ట్రీలపై దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. చేయూత ద్వారా ఐదేళ్లలో అందించే 75 వేల కంటే అదనపు ఆర్థిక సాయం కావాలంటే బ్యాంకుల ద్వారా రుణం అందిస్తామని మంత్రి బొత్స స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:
AP HighCourt: గ్రామ సచివాలయాలపై హైకోర్టు విచారణ.. జీవో 2ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు