Minister Kakani on YSR Farmer Assurance: నాలుగో విడత రైతు భరోసా-పీఎం కిసాన్‌లో భాగంగా ఒక్కో రైతుకు రూ.13,500 చెల్లించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. రైతులకు ఇప్పటివరకూ రూ.23,875 కోట్లు చెల్లించామన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా అన్ని రకాల సేవలు అందిస్తున్నామన్నారు. జూన్ 6వ తేదీన రైతు రథం పథకం ద్వారా.. సీఎం 3 వేల ట్రాక్టర్ల పంపిణీ చేస్తారని వెల్లడించారు. సీజన్ ముగిసేలోగా పంట నష్టం పరిహారాన్ని అందిస్తామని పేర్కొన్నారు.
వివిధ పథకాల ద్వారా రూ.1.10 లక్షల కోట్ల మేర రైతులకు లబ్ధి కలిగిందని.. కొందరు దురుద్దేశపూర్వకంగా ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని కాకాణి మండిపడ్డారు. 46 లక్షల టన్నుల పంట ఉత్పత్తులు అదనంగా వచ్చాయన్నారు. సహేతుకమైన విమర్శలు చేస్తే.. ప్రభుత్వం సరిదిద్దుకుంటుందని స్పష్టం చేశారు. వ్యవసాయం గురించి తెలియని వ్యక్తులు ముఖ్యమంత్రికి ఏం ప్రశ్నలు సంధిస్తారని ప్రశ్నించారు. వ్యవసాయానికి విద్యుత్ మీటర్ల విషయంలో చంద్రబాబు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
ఒక జిల్లాలో ప్రయోగాత్మంగా చేపట్టిన ప్రాజెక్టులో 30 శాతం మేర విద్యుత్ ఆదా ఆయ్యిందని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. రైతుల పేరిట ఇన్నాళ్లూ ఎవరో విద్యుత్ వినియోగించారని తెలుస్తోందన్నారు. ఈ విషయంలో చంద్రబాబు, నారా లోకేశ్‌లకు ఏం తెలుసని మాట్లాడుతున్నారో చెప్పాలన్నారు.