Minister Buggana: ప్రభుత్వం చేసిన ఆర్థిక లావాదేవీల నిబద్ధతను కాగ్ ప్రశ్నించలేదని రాష్ట్ర ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. కాగ్ నివేదికలోని అంశాలపై తెదేపా చేసిన ఆరోపణలపై స్పందిస్తూ ఆయన ఓ ప్రకటన జారీ చేశారు. విధానపరమైన అభ్యంతరాలను మాత్రమే కాగ్ వ్యక్తం చేసిందని ఆయన అన్నారు. విధానపరమైన జాప్యాలకు కారణం తెదేపా ప్రభుత్వ హయాంలోని సీఎఫ్ఎంఎస్ మాత్రమేనని బుగ్గన స్పష్టం చేశారు. తెదేపా పాలన, కొవిడ్ కారణాల వల్లే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతిందని అన్నారు. 2015-21 మధ్య వివిధ ఆర్థిక అంశాలపైనా కాగ్ అభ్యంతరాలను వ్యక్తం చేసిందని తెలిపారు.
సీఎఫ్‌ఎంఎస్ రిపోర్టింగ్ విధానంలో బుక్ అడ్జెస్ట్మెంట్ లావాదేవీలను గుర్తించేందుకే ప్రత్యేక బిల్లులుగా పేర్కొన్నామని బుగ్గన వెల్లడించారు. తెదేపా నేతలు ఆరోపించినట్టు రూ.26,839 కోట్ల ప్రత్యేక బిల్లులు నగదు లావాదేవీలు కావని, అవి పుస్తకాల్లో సర్దుబాట్లు మాత్రమేనని చెప్పారు. ఆర్థిక లావాదేవీల్లో ఎక్కడా ట్రెజరీ కోడ్ ఉల్లంఘన జరగలేదన్నారు. ఆర్థిక లావాదేవీల పుస్తక సర్దుబాట్లకు కారణం సీఎఎఫ్ఎంఎస్లోని సాఫ్ట్వేర్ తప్పిదమేనని స్పష్టం చేశారు.
"ప్రభుత్వ ఆర్థిక లావాదేవీల నిబద్ధతను కాగ్ ప్రశ్నించలేదు. విధానపరమైన అభ్యంతరాలనే కాగ్ వ్యక్తం చేసింది. విధానపర జాప్యాలకు కారణం గత ప్రభుత్వ సీఎఫ్ఎంఎస్ మాత్రమే. తెదేపా పాలన, కొవిడ్ వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతింది. 2015-21 మధ్య వివిధ ఆర్థికాంశాలపై కాగ్ అభ్యంతరం తెలిపింది. బుక్ అడ్జస్ట్‌మెంట్ లావాదేవీలు గుర్తించేందుకే ప్రత్యేక బిల్లుల ప్రస్తావన. రూ.26,839 కోట్ల ప్రత్యేక బిల్లులు నగదు లావాదేవీలు కాదు. ఆర్థిక లావాదేవీల్లో ఎక్కడా ట్రెజరీ కోడ్ ఉల్లంఘన జరగలేదు." -మంత్రి బుగ్గన
సీఎఫ్ఎంఎస్ లోపాల వల్ల 2020-21 వరకే బుక్ అడ్జెస్ట్మెంట్స్ విధానం అవలంబించామని, కాగ్ సలహాతో నిల్ అడ్జెస్ట్మెంట్ బిల్లుల పద్ధతిలో ప్రస్తుతం జమా ఖర్చుల నిర్వహణ చేస్తున్నట్టు బుగ్గన తెలిపారు. రైతు భరోసా చెల్లింపులకు రిజర్వు బ్యాంకు ఈ-కుబేర్ సాఫ్ట్వేర్ ద్వారా సాధ్యపడక రూ.5,454 కోట్లకు సంబంధించి 16 బుక్ అడ్జెస్ట్మెంట్ లావాదేవీలు జరిగాయన్నారు.
మరోవైపు శాసనభను అవమానిస్తున్న తెదేపాకే ప్రివిలేజ్ నోటీసు ఇవ్వాలని బుగ్గన ఆక్షేపించారు. శాసనసభ నిర్వహణలో తెదేపా కన్నా నియంత మరొకరు లేరని ఆయన ఆరోపించారు. తెదేపా హయాంలో పెట్టిన డిస్కమ్‌ల బకాయిలు 14, 15వ ఆర్థిక సంఘం నిధులతో చెల్లింపులు చేశామని అన్నారు. కొవిడ్ సమయంలో పేదలకు డీబీటీ ద్వారా రూ.57,512 కోట్లను రాష్ట్రప్రభుత్వం చెల్లించిందన్నారు. ప్రభుత్వం చేస్తున్న ఆర్థిక లావాదేవీల నిర్వహణ మాజీ మంత్రి యనమలకు తెలియకపోయినా రాష్ట్రప్రజలకు తెలుసునని వ్యాఖ్యానించారు. శాసనసభలో వాయిదా తీర్మానాలు ప్రతిపాదించి అడ్డుకోవాలనే సంస్కృతిని తెదేపానే మొదలు పెట్టిందని మంత్రి బుగ్గన విమర్శించారు.
ఇవీ చదవండి: