Minister Botsa: ప్రభుత్వ విధానాలను ఉపాధ్యాయులు ప్రశ్నించకూడదని, ఉద్యోగరీత్యా విధుల్లో ఇబ్బందులొస్తే వాటిపైనే మాట్లాడాలని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ హెచ్చరించారు. ఉద్యమాలు చేస్తున్న టీచర్లు తమ పిల్లలను ఎక్కడ చదివిస్తున్నారు? ప్రైవేటు బడుల్లో ఎందుకు చేర్పిస్తున్నారు? ప్రభుత్వ బడుల్లో చేర్పించొచ్చు కదా? అని ప్రశ్నించారు. సచివాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘మన పిల్లలు బాగా చదువుకోవాలి. కానీ పేద పిల్లలు పేదలుగానే ఉండాలా? వారు మన దగ్గరకు వచ్చి ఊడిగం చేస్తూ ఉండాలా? ప్రజల సంక్షేమం చూడటం ప్రభుత్వ లక్ష్యం. డబ్బులున్న పిల్లలు చదువుతున్న ఎల్‌కేజీ, యూకేజీ విధానాన్ని గ్రామీణ పేదలకూ అందించాలన్నదే ప్రభుత్వ విధానం. మూడో తరగతి నుంచి సబ్జెక్టు టీచరుతో బోధన చేయిస్తున్నాం. దిల్లీలో విద్యా విధానం ఎందుకు అందరూ బాగుందంటున్నారు? కేరళలో ఎందుకు 100 శాతం అక్షరాస్యత ఉంది? ఆంధ్ర ఎందుకు వెనుకబడి ఉంది. ఎందుకు ముందు ఉండకూడదు? సంస్కరణ ఫలితాలు వచ్చేందుకు మూడు, నాలుగేళ్లు పడుతుంది. ప్రస్తుతం చాలాచోట్ల 1- 5 తరగతులకు ఒకే గది, ఒకే టీచరు ఉన్న పరిస్థితులున్నాయి. వీటిలో మార్పు తీసుకొస్తున్నాం. 3, 4, 5 తరగతుల విలీనం కారణంగా సామాజిక సమానత్వం వస్తుంది. రాజకీయంగా దుష్ప్రచారం చేస్తూ తల్లిదండ్రులను రెచ్చగొడుతున్నారు. 5,200 బడులు మ్యాపింగ్ చేస్తే కేవలం 300 వాటిల్లోనే సమస్యలు వచ్చాయి. వీటిపై పరిశీలనకు కమిటీలు వేశాం. నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటాం’ అని వెల్లడించారు.
ప్రైవేటులోనూ మా సిలబసే.. ‘పాఠ్యపుస్తకాల్లో కొంత జాప్యం జరిగిన మాట వాస్తవం. ప్రైవేటు బడులకూ పుస్తకాలు అందించాలని నిర్ణయించాం. అక్కడా ప్రభుత్వ సిలబస్‌ను అమలు చేయాలని దీన్ని తీసుకొచ్చాం. పరీక్షలు మేము ఇచ్చిన సిలబస్‌పైనే ఉంటాయి. వాటిని చెబుతూ ప్రైవేటులో అదనంగా 10 పుస్తకాలు పెట్టుకున్నా అభ్యంతరం లేదు. ప్రభుత్వ సిలబస్‌నే మార్చేసి, దాని అర్థమే మార్చేస్తామంటే ఎలా? ప్రభుత్వంపై నమ్మకం లేకో ఏమో ప్రైవేటు యాజమాన్యాలు వారికి ఎన్ని పుస్తకాలు అవసరమో చెప్పలేదు. దీంతో తక్కువ పుస్తకాలను ముద్రించాం. నా దృష్టికి రాగానే ఇండెంట్ పెట్టుకునేందుకు వెబ్‌సైట్ తెరిచాం. అడిగిన వారికి 15 రోజుల్లో సరఫరా చేస్తాం. ప్రభుత్వమే పుస్తకాలు ఇస్తున్నందున ఎక్కువ ధరకు అమ్ముకునే అవకాశం యాజమాన్యాలకు ఉండదు’ అని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.
ఇవీ చూడండి: