విజయవాడలో నూతనంగా నిర్మించిన జలవనరుల శాఖ కార్యాలయాన్ని ఆ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రారంభించారు. రూ.16.23 కోట్లతో జలవనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ కార్యాలయంతో పాటు ఇతర కార్యాలయాలు ఉండేలా కొత్త భవనాన్ని నిర్మించారు. జలవనరుల శాఖకు చెందిన వివిధ కార్యాలయాలన్నీ ఒకేచోట ఉండేలా ఈ నూతన భవన నిర్మాణం చేపట్టినట్లు మంత్రి అనిల్ కుమార్ స్పష్టం చేశారు.
నాలుగు అంతస్తులుగా నిర్మించిన ఈ భవనంలో జలవనరుల శాఖ ఇంజనీర్ ఇన్ చీఫ్ కార్యాలయంతో పాటు కృష్ణా డెల్టా చీఫ్ ఇంజనీర్, కేసీ డివిజన్ , అంతర్రాష్ట్ర జల అంశాల చీఫ్ ఇంజనీర్ కార్యాలయాలు ఉంటాయని మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు కూడా సాగునీరు అందించేలా జలవనరుల శాఖ ప్రయత్నాలు చేస్తోందని మంత్రి అనిల్ స్పష్టం చేశారు. కార్యాలయ ప్రారంభోత్సవంలో దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
పోలవరం నిర్వాసితులను ఆదుకుంటాం
అనంతరం సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి అనిల్ సమీక్ష నిర్వహించారు. పోలవరం, ఇతర ప్రాజెక్టుల పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని 58 ప్రాజెక్టులకు రూ.14,750 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు. పోలవరం నిర్వాసితులను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. ప్రాజెక్టుల అంతర్రాష్ట్ర సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుంటామని మంత్రి అనిల్ తెలిపారు.
ఇదీ చదవండి
Buddha Venkanna : జగన్‌రెడ్డికి ఓటమి భయం పట్టుకుంది: బుద్ధా వెంకన్న