కేంద్ర ప్రాయోజిత పథకంలో భాగంగా రాష్ట్రంలో మెగా బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు కృషి చేసేలా ఏపీఐఐసీకి బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్రంతో సంప్రదింపులు చేసేందుకు ఉన్నతాధికారులతో కూడిన స్టేట్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీని ఏర్పాటు చేస్తూ పెట్టుబడులు మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ఆదేశాలు ఇచ్చింది. స్టేట్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీగా ఏపీ బల్క్ డ్రగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీఐఐసీ అనుబంధ సంస్థగా ఈ కార్పొరేషన్ పనిచేయనుంది.
రాష్ట్రంలో మెగా బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటుకు 2 వేల ఎకరాల భూమిని గుర్తించాల్సిందిగా ప్రభుత్వం సూచించింది. వచ్చే ఐదేళ్లలో దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయనున్న 3 మెగా బల్క్ డ్రగ్ పార్కుల్లో ఒకటి ఏపీలో ఏర్పాటు చేసేలా ప్రయత్నాలు చేయాలని ప్రభుత్వం ఎస్ఐఏకు స్పష్టం చేసింది. సమగ్రమైన ప్రాజెక్టు నివేదిక రూపకల్పనకు ఐఐసీటీ-సీఎస్ఐఆర్ కు బాధ్యతలు అప్పగించింది. ఇప్పటికే ఫార్మా పరిశ్రమలతో పాటు ఎగుమతుల్లో కీలకంగా ఉన్న ఏపీలోనే ఈ మెగా బల్క్ డ్రగ్ పార్కును ఏర్పాటుకు అవకాశాలున్నాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. పార్కు నిర్మాణానికి కేంద్రం వెయ్యి కోట్ల రూపాయల మేర నిధులు మంజూరు చేసే అవకాశం ఉంది.
ఇవీ చదవండి:
సరికొత్త ఆలోచనలకు ఆహ్వానం... అంకుర సంస్థలకు కేంద్రం ప్రోతాహ్సం