Pegasus software: రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో ప్రజల వ్యక్తిగత సమాచార చౌర్యం జరిగిందనే అభిప్రాయానికి శాసనసభా సంఘం వచ్చినట్లు తెలిసింది. పెగాసస్ సాఫ్ట్‌వేర్, డేటా చోరీ తదితర అంశాలను విచారించేందుకు ఏర్పాటైన ఈ సంఘం మంగళవారం మరోసారి భేటీ అయింది. గత నెలలో రెండుసార్లు సమావేశమైన సంగతి విదితమే. అసెంబ్లీ కమిటీ హాలులో సంఘం అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి అధ్యక్షతన జరిగిన భేటీలో సభ్యులు మొండితోక జగన్‌మోహన్ రావు, కొఠారి అబ్బయ్యచౌదరి, హోం, ఐటీ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
‘రాష్ట్ర ప్రజల ఆధార్ సమాచారాన్ని 2016-19 మధ్య అప్పటి ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు బదలాయించింది. ఆ సమాచారం ఆధారంగా ఓటర్ల జాబితాలో పేర్లను తొలగించారు. ప్రభుత్వం దగ్గర ఉండాల్సిన వ్యక్తిగత డేటాను ప్రైవేట్‌వారికి ఇవ్వడం ప్రజల భద్రతకు ముప్పే’ అనే అభిప్రాయాన్ని సభా సంఘం వ్యక్తం చేసినట్లు సమాచారం. దాదాపు 3 గంటలపాటు నిర్వహించిన సమీక్షలో అప్పటి వ్యవహారంపై విజిలెన్స్ విచారణలో వెల్లడైన అంశాలను హోంశాఖ అధికారులు.. సంఘం ముందుంచినట్లు తెలిసింది.
‘సంబంధిత శాఖల మంత్రులు, అధికారుల ప్రమేయం లేకుండా డేటా చౌర్యానికి అవకాశం ఉండదు’ అనే కోణంలో సభాసంఘం సమీక్ష కొనసాగించినట్లు సమాచారం. ‘ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యం ఏమిటి? ఎవరెవరున్నారో గుర్తించి, వారిని పిలిచి విచారించాల్సిన అవసరం ఉందని భావిస్తే పిలవాలి’ అని సభా సంఘం నిర్ణయించింది. బుధవారమూ నిర్వహించనున్న సమావేశంలో చర్చ తర్వాత డేటా చౌర్యం విషయంపై సభాసంఘం తుది నిర్ణయానికి రానున్నట్లు భూమన కరుణాకరరెడ్డి విలేకరులకు చెప్పారు.
ఇవీ చూడండి: