కరోనా వైరస్.. రవాణా రంగంలో పెను సంక్షోభమే సృష్టించింది. సరకు రవాణాలో లారీలు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ విపత్కర సమయంలో చాలా లారీలు షెడ్లకే పరిమితమయ్యాయి. కొవిడ్ క్రమంగా తగ్గినా..రాత్రి పూట కర్ఫ్యూ అమలు... లారీ యజమానులకు గుదిబండలా మారింది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు పూర్తిగా ఉత్పత్తి తగ్గించడంతో.. సరకు రవాణా లేక లారీ యజమానులు సతమతమవుతున్నారు. భారీ స్థాయిలో రవాణా మెుత్తం రైల్వే శాఖకు వెళ్లటం... మరింత ఇబ్బందులకు గురిచేసిందని లారీ యజమానులు చెబుతున్నారు.
సరకు రవాణా లారీలపై ఆధారపడి ప్రత్యక్షంగా,పరోక్షంగా రాష్ట్రంలో లక్షల మంది జీవిస్తున్నారు. పెరిగిన డీజిల్ ధరకు సరకు రవాణా చేయలేకపోతున్నామని లారీ యజమానులు అంటున్నారు. ఆరేళ్ల క్రితం డీజిల్ ధర ఉన్నప్పుడు సరకు రవాణాకు కిరాయి ఎంత ఉందో.. ఇప్పుడు అంతే ఉందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆస్తులు అమ్ముకొని లారీలకు ఫైనాన్స్ చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్ను మినహాయింపు ఇచ్చి ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
లారీడ్రైవర్ల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. సరకు రవాణా లేక పనులు తగ్గిపోయాయి. ఉపాధి లేక పస్తులుండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: polavaram: పోలవరం వరద కష్టాలు.. గ్రామాలను వదిలిపోతున్న నిర్వాసితులు