విజయవాడలో లాక్‌డౌన్ అమల్లో ప్రణాళికా లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 200కు పైగా నమోదైతే వీటిలో విజయవాడలోనే 150 (80శాతం)కి పైగా కేసులున్నాయి. నగరంలోని 60 కేసులకు ఇద్దరే కారణం కావడం గమనార్హం. కృష్ణలంకకు చెందిన ఓ ట్రక్కు డ్రైవర్ ద్వారా 24 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. మాచవరం కార్మికనగర్‌కు చెందిన యువకుడి ద్వారా మరో 36 మందికి మహమ్మారి సోకింది. నగర పోలీసు కమిషనరేట్ పరిధిలోని 10మంది పోలీసు సిబ్బంది కూడా వ్యాధి బారిన పడ్డారు. లాక్‌డౌన్ నిబంధనలు ఉదయం 9 గంటల తర్వాత కఠినంగా అమలవుతున్నా ప్రణాళిక లోపం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.
కనిపించని భయం
జిల్లాల్లో కరోనా కేసులు క్రమేణా పెరుగుతున్నా ప్రజల్లో మాత్రం భయం ఉండట్లేదు. లాక్‌డౌన్ మినహాయింపు సమయంలో సరకుల కోసం రహదారులపైకి గుంపులుగా వచ్చేస్తున్నారు. అధికారులు ఉదయం 9 గంటల లోపు మాత్రమే సరకులకు సమయం కేటాయించటంతో లాక్‌డౌన్ నిబంధనలు సరిగ్గా అమలు కావడం లేదు. 9 గంటల తర్వాత కఠినంగా నిబంధనలు అమలు చేస్తున్నా ఈ లోపు ప్రమాదం జరిగే అవకాశాలపై మాత్రం ఎవరూ దృష్టి పెట్టడంలేదు.
మొబైల్ రైతు బజార్ల ద్వారా ఇళ్లకు సరకుల సరఫరా పెంచి.. 3 గంటల్లోనే అన్నీ తీసుకోవాలనే నిబంధనల్లో సడలింపు చేసి.. ప్రత్యామ్నాయాలు చేపడితే బాగుంటుందనే వాదన వినిపిస్తోంది. విడతల వారీగా కాలనీల్లోనే పచారీ దుకాణాలు, సూపర్ మార్కెట్లకు రోజు విడిచి రోజు సాయంత్రం వరకు అనుమతి ఇస్తే ప్రజలు పోగవడం తగ్గుతుందనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది.
ఇదీ చదవండి: