లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో పట్టణ, నగర ప్రాంతాల్లో దుకాణాలు, సంస్థలు తెరుచుకునేందుకు పురపాలక శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. 31వ తేదీ వరకు లాక్ డౌన్ కొనసాగిస్తూనే.. నిబంధనలు పాటిస్తూ దుకాణాలు తెరుచుకునేందుకు మినహాయింపులు ఇస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. జిల్లా యంత్రాంగం కంటైన్మెంట్, బఫర్ జోన్లలో తీవ్రత తగ్గిందని... డీనోటిఫై చేసే వరకు ఆ ప్రాంతాల్లో దుకాణాలు తెరవకూడదని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు దుకాణాలు తెరుచుకోవచ్చని తాజా ఆదేశాల్లో తెలిపింది.
కాలనీలు, రెసిడెన్షియల్ భవనాల్లో ఉన్న దుకాణాలు తీయోచ్చని పురపాలక శాఖ వెల్లడించింది. సినిమా హాళ్లు, మాల్స్, జిమ్‌లు, పార్కులు, వినోద ప్రాంతాలకు అనుమతి లేదని ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రేక్షకులు లేకుండా క్రీడా మైదానాలు తెరవొచ్చని స్పష్టం చేసింది. హోటళ్లు, రెస్టారెంట్, ఇతర హాస్పిటాలిటీ సేవలకు అనుమతి లేదని పేర్కొన్న ప్రభుత్వం.. వైద్య సిబ్బంది, పోలీసు, అత్యవసర సేవలు, క్వారంటైన్ సేవలు అందిస్తున్న హోటళ్లకు, టేక్ అవే కిచెన్లకు మినహాయింపులిచ్చింది.
మరోవైపు హెయిర్ కటింగ్ సెలూన్లు తెరుచుకునేందుకు అవకాశం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఖరీదైన సెలూన్లు, బడ్జెట్ సెలూన్లకు వేర్వేరుగా మార్గదర్శకాలు వెలువడ్డాయి. హెయిర్ కటింగ్ సెలూన్లలో వినియోగించే పరికరాలు క్రిమిరహితం చేయాలని ఆదేశాలు ఇచ్చింది. స్పా లు, మసాజ్ కేంద్రాలతోపాటు చెప్పులు, వస్త్ర, బంగారు ఆభరణాలు దుకాణాలకు కూడా అనుమతి లేదని స్పష్టం చేసింది.
అనుమతులు ఇచ్చిన దుకాణాల్లో ఏక కాలంలో 50 శాతం మంది సిబ్బందితో మాత్రమే పని చేయాలని పురపాలక శాఖ స్పష్టం చేసింది. అందులో పని చేసే సిబ్బంది భౌతిక దూరం పాటించాలని.. శానిటైజర్లు మాస్కులు వినియోగించాలని దుకాణ యజమానులకు స్పష్టం చేసింది. ఇక నగదు రహిత లావాదేవీలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేస్తూ ఆదేశాలు ఇచ్చింది.
ఇదీ చదవండి: జనావాసాల్లోకి రెడ్, ఆరెంజ్ కేటగిరీ పరిశ్రమలు రావొద్దు: సీఎం