స్థానిక ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వం తమ తమ వైఖరులకు కట్టుబడి ఉండటంతో... ఎన్నికల నిర్వహణపై ఉత్కంఠ నెలకొంది. ఆదివారం నాటి పరిణామాల నేపథ్యంలో సోమవారం కొన్ని పరిణామాలు చకచకా జరిగిపోయాయి. ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ ఎన్నికల కమిషనర్‌కు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖ రాయడంతో పాటు... కమిషనర్ నిర్ణయాన్ని నిలిపివేయాలని విజ్ఞప్తిచేస్తూ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పరిస్థితుల్లోనే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్‌కుమార్... ఎన్నికలను ఎందుకు వాయిదా వేయాల్సి వచ్చిందో వివరించినట్లు తెలిసింది. ఇటు కమిషనర్ ఆదేశించిన అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేయలేదు. ఎన్నికల సంఘం కూడా తమ నిర్ణయంపై ఎలాంటి అడుగూ వేయలేదు. ఎన్నికల వాయిదాకు సంబంధించి యథాతథ పరిస్థితి ఉందని... అంతకుమించి కొత్తగా చెప్పేందుకేమీ లేదని ఎన్నికల సంఘంలో అత్యున్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఓ రకమైన ప్రతిష్టంభన నెలకొంది. ఓవైపు రాజ్యాంగసంస్థ... రెండోవైపు రాష్ట్ర ప్రభుత్వం... పరస్పర భిన్న వైఖరులతో ఉండటంతో ఈ ప్రతిష్టంభన ఎప్పటివరకూ కొనసాగుతుందనే ఉత్కంఠ ఏర్పడింది.
సోమవారం గవర్నర్‌తో సమావేశమైన ఎన్నికల కమిషనర్... సుమారు గంటపాటు చర్చించారు. ఎన్నికల వాయిదా నిర్ణయం తీసుకునేందుకు కారణాలను వివరించారు. సమావేశం ముగిసిన తర్వాత ఆయన ఎలాంటి ప్రకటనా చేయలేదు. మీడియా ప్రతినిధులతోనూ మాట్లాడలేదు. తన ఛాంబర్‌లో పూర్తిగా విధుల్లో నిమగ్నమయ్యారు. ఇక సీఎం జగన్‌ను ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికల కమిషనర్‌గా పనిచేసిన రమాకాంత్‌రెడ్డి కలిశారు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలోని కొందరు ముఖ్యులు... ఆయనతో చర్చలు సాగించినట్లు సమాచారం. ఆ చర్చల సారాంశం మాత్రం తెలియలేదు.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిర్ణయాలను ప్రభుత్వం తరపున అమలు చేసేందుకు చర్యలు తీసుకోగల అధికారం, అమలుతీరును పర్యవేక్షించే బాధ్యతలు... రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికే ఉంటాయి. కానీ ఎన్నికల కమిషనర్... తన నిర్ణయాలను అమలు చేయాలంటూ ఆదివారం రాసిన లేఖకు ప్రతిగా సీఎస్ నీలం సాహ్ని... సోమవారం ఆయనకు లేఖ రాశారు. ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని లేఖలో కోరారు. అంతే కాదు... ప్రజారోగ్య రక్షణ ప్రభుత్వం బాధ్యతని... ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవడానికి ముందే రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి ఉండాల్సిందని లేఖలో పేర్కొన్నారు.
ఎన్నికలను వాయిదా వేస్తూ ఎస్ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని నిలిపివేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అక్కడ ఇంకా ఈ కేసు విచారణకు రాలేదు. ఇవాళ విచారణకు వస్తుందేమోనని ఎదురుచూస్తున్నారు. అయితే విచారణలో ఉన్న కేసుల జాబితాలో ఇది లేదని సమాచారం. కరోనా ప్రభావంతో సుప్రీంకోర్టులో మంగళవారం అత్యవసర కేసులను తప్ప మిగిలిన వాటిని విచారించే పరిస్థితి లేదని చెబుతున్నారు. ఇదే అంశంపై కొందరు హైకోర్టులోనూ పిటీషన్ దాఖలు చేశారు. వాయిదా నిర్ణయాన్ని నిలిపివేయాలని కోరారు. ఇదే అంశంపై సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నందున ఈ పిటిషన్‌పై విచారణ మార్చి 19కి హైకోర్టు వాయిదా వేసింది.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కొందరు ఉన్నతాధికారులపై చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సిఫారసు చేశారు. నామినేషన్లు సందర్భంగా చోటు చేసుకున్న హింస నేపథ్యంలో చిత్తూరు,గుంటూరు కలెక్టర్లను.. ఆ బాధ్యతల నుంచి తప్పించాలని గుంటూరు గ్రామీణ, తిరుపతి అర్బన్ ఎస్పీలను విధుల నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఇద్దరు డీఎస్పీలు, నలుగురు సీఐల బదిలీలకూ ఆదేశాలు జారీ చేశారు. మాచర్ల సీఐను సస్పెండ్ చేయాలని చెప్పినా... సోమవారం రాత్రి వరకూ ఎలాంటి ఉత్తర్వులూ విడుదల కాలేదు.
ఇదీచదవండి