జాతీయ రహదారి భద్రతా ఉత్సవాలను పురస్కరించుకొని విజయవాడ డీటీసీ కార్యాలయంలో ఉమెన్స్ సేఫ్టీ ఇన్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ అంశంపై విద్యార్థినీలు, మహిళలతో సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీటీసీ యం. పురేంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళలు రైళ్లు, బస్సులు, టాక్సీలు వంటి రవాణా సౌకర్యాల ద్వారా ప్రయాణాలు చేసే సమయంలో భద్రతా చర్యలను పూర్తిగా పాటించాల్సిన అవసరం ఉందన్నారు.
మహిళలకు ఎదురయ్యే సమస్యలను అధిగమించేందుకు ప్రభుత్వం కల్పిస్తున్న సహాయక కార్యక్రమాలు సలహాలు, సూచనలను ఆచరించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా వాహన చోదకులు ప్రయాణిస్తున్న మహిళల నుంచి వ్యక్తిగత వివరాలను సేకరించేందుకు ప్రయత్నిస్తారని.. అటువంటి వాటికి అవకాశం ఇవ్వకుండా గోప్యతను పాటించాల్సిన అవసరం ఉందన్నారు. అనుమానం వచ్చిన సందర్భాలలో సహాయం కొరకు ప్రభుత్వం కల్పించిన డయల్ 100, దిశ మొబైల్ యాప్ లను ఉపయోగించుకోవడం ద్వారా రాబోయే ప్రమాదాలను అరికట్టుకో గలుగుతారన్నారు.
అలాగే గోడ్డు ప్రమాదాలపై మహిళల్లో అవగాహనను పెంపొందించినప్పుడు పూర్తి స్థాయిలో రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు అవకాశం ఉంటుందన్నారు. నేటి ఆధునిక ప్రపంచంలో ఉద్యోగిణిలతోపాటు, గృహిణిలు సైతం స్వయంగా వాహనాలను నడుపుతున్నారన్నారు. వారి దైనందిన పనుల్లో నిమగ్నం అవుతున్నారన్నారు. పురుషులతో పాటు సమానంగా వాహనాలను వినియోగిస్తున్న తరుణంలో మహిళల్లో కూడా ట్రాఫిక్ నిబంధనలతో పాటు హెల్మెట్, సీట్ బెల్స్ వంటి వాటిని తప్పక వినియోగించలాన్నారు. చైతన్యవంతులను చేసి రోడ్డు ప్రమాదాల నివారణతో పాటు ప్రాణ నష్టాలను కూడా నివారించే అవకాశం ఉంటుందన్నారు.