తెలంగాణ నుంచి రాజ్యసభకు సభ్యులను పంపటం వెనుక ముఖ్యమంత్రి జగన్ సొంత ప్రయోజనాలు ఉన్నాయని జై భీం భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రావణ్ కుమార్ ఆరోపించారు. వైకాపా రాజ్యసభ సభ్యుల ఎంపిక రాజకీయ అజెండాతోనే జరిగిందన్నారు. రాష్ట్రంలో ఒక్క బీసీ నాయకుడికి కూడా రాజ్యసభకు వెళ్లే అర్హత లేదా ? అని నిలదీశారు. ఇతర రాష్ట్రాల నుంచి ఎంపిక చేస్తే.. రాజ్యసభలో మన రాష్ట్ర సమస్యలు ఎలా ప్రస్తావిస్తారని ప్రశ్నించారు. తెలంగాణ నుంచి ఆంధ్ర నాయకులను రాజ్యసభకు పంపితే అక్కడి ప్రజలు ఊరుకుంటారా ? అని నిలదీశారు.
రాష్ట్ర ప్రజలపై నోరు పారేసుకున్న తెలంగాణ వ్యక్తిని ఏపీ తరపున రాజ్యసభకు పంపడం సమంజసమా ? అని అన్నారు. ప్రతి అంశంలో రాష్ట్రాన్ని అవహేళన చేస్తున్న పక్క రాష్ట్రాల వారిని అందలం ఎక్కిస్తారా అని మండిపడ్డారు. ఇప్పటికే తెలంగాణ వారిని సలహాదారులుగా నియమించుకున్నారని.., వారు రాష్ట్రానికి ఏం మేలు చేశారో చెప్పాలన్నారు. జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న మాయలు, మోసాలను ఏపీ ప్రజలు గుర్తించాలని శ్రావణ్ వ్యాఖ్యనించారు.
"పక్క రాష్ట్రం నుంచి ఇద్దరికి రాజ్యసభ సభ్యులుగా ఇవ్వడం సరికాదు. మన రాష్ట్రంలో బీసీలు లేరా ? మైనారిటీలు లేరా ? ఎస్సీ, ఎస్టీలు లేరా ?. మనల్ని అవహేళనగా మాట్లాడుతున్న తెలంగాణ నుంచి సభ్యులను ఎంపిక చేస్తారా ?. తెలంగాణలో ఆంధ్రావాళ్లకు రాజ్యసభ సభ్యత్వం ఇస్తే అక్కడి ప్రజలు ఊరుకుంటారా ?. జాగో బాగో అన్నవాళ్లకు ఏవిధంగా పదవులు పంపకం చేస్తారు. బీసీలకు సమన్యాయం అంటే పక్క రాష్ట్రం వాళ్లకు పదవులు ఇవ్వడమా ?. మీ ఆస్తులు కాపాడుకోవడానికి పక్క రాష్ట్రాల వాళ్లకు పదవులు ఇస్తున్నారు. తెలంగాణ వాళ్లకు పదవులు ఇస్తే రాష్ట్రానికి ఎలా న్యాయం చేయగలరు. రాష్ట్ర ప్రయోజనాలపై మాట్లాడలేని విజయసాయిరెడ్డికి మళ్లీ అవకాశమా ?." -శ్రావణ్ కుమార్, జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు
ఇవీ చూడండి: