Less wages - No labours: భూముల రీ-సర్వేకు కీలకమైన సరిహద్దు రాళ్లు పాతేందుకు కూలీలు ముందుకు రావడంలేదు. రవాణా ఛార్జీలతో కలుపుకొని ‘ఎ’ శ్రేణి రాయి పాతితే.. రూ.50, ‘బి’ శ్రేణి రాయికి రూ.36 ఇస్తామని ప్రభుత్వం చెప్పడంతో సర్వే, రెవెన్యూ శాఖల అధికారులు సతమతమవుతున్నారు. గడువులోగా రీ-సర్వే పూర్తి చేయాలని ఒత్తిడి చేస్తున్న అధికారులు కూలీలకు కేటాయించిన నిధుల గురించి పట్టించుకోవడంలేదని ఉద్యోగులు వాపోతున్నారు. ఈ ప్రక్రియకు అయ్యే వ్యయాన్ని ప్రభుత్వమే భరించాలి. కానీ.. ఆ దిశగా జిల్లాల్లో అధికారులు చర్యలు తీసుకోవడం లేదు.
కొన్నిచోట్ల రాళ్లను రైతులే సరిహద్దుల్లో పాతుకోవాలని సూచిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో పొలాల మధ్య, ముఖ్య కూడళ్లు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద రాళ్లు ఉంటున్నాయి. వాటిని తరలించడం వల్ల లోడింగ్, అన్‌లోడింగ్ కూలీలు పెరుగుతున్నాయి. ఉదాహరణకు చిత్తూరు జిల్లా ముత్తుకూరుపల్లెలో మూసేసిన పాఠశాల ఆవరణలో వీటిని ఉంచారు. ‘ఎ’, ‘బి’ శ్రేణి రాళ్ల బరువు ఒక్కోటి 90 కిలోల వరకు ఉంటుంది.
సర్వే నంబర్ల వారీగా వేసే రాళ్ల బరువు 40 కిలోల వరకు ఉంటుంది. వీటిని పాతాలంటే ఇద్దరు కూలీలు అవసరం. వేలాది ఎకరాలున్న గ్రామాల్లో అధిక సంఖ్యలో కూలీలు కావాలి. ఒక్కో రాయి పాతేందుకు రూ.100 అయినా వెచ్చించాలి. ఈ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లామని కృష్ణా జిల్లాలోని పలు మండలాల సిబ్బంది తెలిపారు.
ఇతర ఖర్చులు.. డ్రోన్లను ఎగరవేసేందుకు ముందు జీసీపీ పాయింట్/స్టోన్స్ వద్ద జంగిల్ క్లియర్ చేసేందుకు ఒక్కో గ్రామంలో కనీసం నలుగురు కూలీలు అవసరం. వీరితో పని చేయిస్తే రూ.2,000 వరకు ఖర్చవుతోంది.
అబాది భూముల చుట్టూ సున్నంతో మార్కింగ్ చేసేందుకు, కూలీల వినియోగానికి మరో రూ.2,500 వరకు, డ్రోన్లను ఎగరవేసే సమయంలో ఫ్లాన్క్స్ పట్టుకునేందుకు వినియోగించే సిబ్బంది రోజు వారీ ఖర్చుల కోసం రూ.2,000 వ్యయమవుతోంది. కానీ..ఇవేమీ అధికారులు గుర్తించడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయన్న ధీమా లేనందున సొంత డబ్బు ఖర్చుపెట్టేందుకు వెనకాడుతున్నారు. చెట్లు తొలగించేందుకు ఉపాధి కూలీలను వినియోగించుకోవాలని ఆదేశాలు ఉన్నాయి. వీరు తక్కువ సమయం ఉంటున్నందున నిర్ణీతకాలంలో పనులు పూర్తి కావడంలేదు.
- భూ రికార్డుల స్వచ్ఛీకరణలో భాగంగా వివరాల నమోదుకు ఒక్కో గ్రామానికి సుమారు రూ.1,000 వరకు ఖర్చవుతోంది.
- ఓఆర్‌ఐ మ్యాపులు కొన్ని జిల్లాల్లో మండలాల స్థాయిలో ముద్రించాలని చెబుతున్నారు. దీనివల్ల ఒక్కో గ్రామానికి సగటున రూ.1,000 వరకు ఖర్చవుతోంది.
- రైతులకు నోటీసులు, ఇతర అవసరాలకు సంబంధించిన ప్రింట్ల కోసం రూ.2,000 ఖర్చుపెట్టాల్సి వస్తోంది.
- సర్వే ఆఫ్ ఇండియా ఇంజినీర్ల కోసం వాహనాలు ఉపయోగిస్తున్నారు. ఇందుకు అయ్యే అద్దె మొత్తాన్ని ముందుగా సర్వేయర్లు చెల్లిస్తే ఆ తర్వాత ఎప్పటికో ప్రభుత్వం నుంచి జమవుతున్నాయి.
ఇవీ చూడండి: