గన్నవరం విమానాశ్రయ అభివృద్ధి అంశాన్ని లోక్‌సభలో.. కేశినేని నాని ప్రస్తావించారు. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి సామర్థ్యం పెంచాలని ఎంపీ కోరారు. ఎగుమతి అభివృద్ధి అథారిటీ చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయ ఎగుమతులు ఓడరేవులకు పంపాల్సి వస్తోందని.. గన్నవరంలో వ్యవసాయ ఎగుమతి హబ్‌ను ఏర్పాటు చేయాలని కేశినేని నాని కోరారు.
'విజయవాడ, చుట్టుపక్కల ప్రాంతాలు వ్యవసాయ ఎగుమతి వస్తువులకు ప్రసిద్ధి చెందాయి. గుంటూరు ఎర్ర మిరపకాయలు, నూజివీడు మామిడి, పసుపు, పొగాకు ఉన్నాయి. ఇటీవల మత్స్య సంపద ఎగుమతిలో ఈ ప్రాంతం గొప్ప సామర్థ్యాన్ని పెంపొందించుకోగలిగింది. వ్యవసాయ, వ్యవసాయ ఆధారిత ఎగుమతి సామర్థ్యాన్ని మరింత ప్రోత్సహించేందుకు.. వ్యవసాయ, ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఏపీఈడీఏ) విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో ఎగుమతి సౌకర్యాలను అభివృద్ధి చేయాలి. ఇటీవలే ప్రారంభించిన వారణాసి విమానాశ్రయంలో ఏపీఈడీఏ ప్రత్యేకంగా వ్యవసాయ ఉత్పత్తులు మాత్రమే ఎగుమతి చేసేందుకు సౌకర్యాలు కల్పించింది. విమానాశ్రయంలో కోల్డ్ స్టోరేజీ, కస్టమ్స్ క్లియరెన్స్, ఫైటోశానిటరీ క్లియరెన్స్ తదితర సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్ని సంవత్సరాలుగా.. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు పెరుగుతున్నాయి. 2020-21లో.. ఎగుమతుల పరిమాణం 52 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా నమోదైంది. దీని విలువ రూ.13,700 కోట్లు. కానీ.. విజయవాడ ప్రాంతంలోని వ్యవసాయ సరకులు ప్రస్తుతం రాష్ట్రంలోని ఏదో ఒక ఓడరేవుకు లేదా.. విశాఖపట్నం విమానాశ్రయానికి రవాణా చేయాల్సి వస్తోంది. విజయవాడ విమానాశ్రయంలో ఎగుమతి సౌకర్యాలను అభివృద్ధి చేయగలిగితే.. ఆంధ్ర వ్యవసాయ వస్తువుల ఎగుమతి వృద్ధి గణనీయంగా పెరుగుతుంది. విజయవాడ ప్రాంతం నుంచి వ్యవసాయ వస్తువులను సులభంగా, వేగంగా ఎగుమతి చేయడానికి వీలవుతుంది. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే లక్ష్యంలో భాగంగా.. విజయవాడ విమానాశ్రయంలో వ్యవసాయ ఎగుమతి హబ్‌ను తక్షణమే అభివృద్ధి చేయాలి.' - ఎంపీ కేశినేని నాని
ఇదీ చదవండి: